Space Race: US-China Rivalry Is Extending From Earth Into Space, Know Details - Sakshi
Sakshi News home page

US-China Space Race: అంతరిక్షంలో ఆధిపత్య పోరు

Published Fri, Mar 18 2022 4:07 AM

US-China rivalry is extending from Earth into space - Sakshi

భూమిపై దేశాల మధ్య రాజకీయాలు నింగికి పాకుతున్నాయి. పలు అంశాల్లో అమెరికాకు సవాలు విసురుతున్న చైనా తాజాగా అంతరిక్షంలో ఆధిపత్య పోరుకు తెర తీసింది. దీంతో ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌– అమెరికా మధ్య ఉన్న పోటీ మరోమారు చైనా– యూఎస్‌ రూపంలో అంతరిక్షంలో కనిపించనుంది.  

అగ్రరాజ్య హోదా కోసం తహతహలాడుతున్న చైనా తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు అన్ని రంగాల్లో విపరీతంగా శ్రమిస్తోంది. ప్రపంచ పెద్దన్న అమెరికా ప్రాబల్యమున్న వివిధ అంశాల్లో కాలు మోపి ఉనికి చాటుకోవాలని యత్నిస్తోంది. తాజాగా అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. యూఎస్‌ఎస్‌ఆర్‌ (సోవియట్‌ రిపబ్లిక్‌) కుప్పకూలక ముందువరకు అమెరికాతో ఇదే తరహా పోటీ చూపేది. అయితే సోవియట్‌ పతనానంతరం ప్రపంచం ఏక ధ్రువ ప్రపంచంగా మారిపోయింది.

సోవియట్‌ వదిలి వెళ్లిన ఖాళీని పూడ్చేందుకు చైనా రంగంపైకి వచ్చింది. ఈ క్రమంలో 2021లో అంతరిక్ష ప్రయోగాల పరంగా చైనా అదరగొట్టింది. గత ఏడాది చైనా మొత్తం 55 అంతరిక్ష ప్రాజెక్టులు చేపట్టగా అమెరికా 51తో సరిపుచ్చుకుంది. 2030 నాటికి కుజుడు (మార్స్‌)పైకి ఉపగ్రహాన్ని పంపి శాంపిళ్లను తీసుకువస్తామని తాజాగా చైనా లూనార్‌ ప్రోగ్రామ్‌ డిజైనర్‌ వూ వైరెన్‌ ప్రకటించారు.

అంతటితో తమ యత్నాలు ఆగవని, సౌర వ్యవస్థలో ఇప్పటివరకు వెళ్లని దూరాలను అన్వేషిస్తామని చెప్పారు. ఇప్పటికే చైనా చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపి అక్కడి నుంచి శాంపిళ్లను విజయవంతంగా తీసుకువచ్చింది. ఇదే తరహాలో మార్స్‌ మిషన్‌ పూర్తి చేస్తామని వూ చెప్పారు. చంద్ర మిషన్‌తో పోలిస్తే మార్స్‌ మిషన్‌ క్లిష్టమైనదని, ముందుగా శక్తివంతమైన లాంచ్‌ వాహనాన్ని రూపొందించాల్సి ఉందని చెప్పారు.  

మేమే ముందు..
మార్స్‌పైకి మనిషిని పంపే ప్రణాళికకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను గత ఏడాది చైనా విడుదల చేసింది. 2033– 2043 కాలంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సంకల్పించినట్లు ప్రకటించింది. 2020లోనే చైనా గ్రహాంతరయానానికి తొలిమెట్టు అయిన టియాన్‌వెన్‌ –1 ప్రోబ్‌ను ప్రయోగించింది. ఈ ప్రోబ్‌ 2021లో మార్స్‌ కక్ష్యలోకి ప్రవేశించింది. మే నెలలో ఈ ప్రోబ్‌ నుంచి జురాంగ్‌ అనే రోవర్‌ను కుజుడి ఉపరితలంపైకి దించారు.

ఈ రోవర్‌ నిర్ధేశిత పనులను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో రష్యా, అమెరికా తర్వాత మార్స్‌పైకి రోవర్‌ను సురక్షితంగా ల్యాండ్‌ చేసిన మూడో దేశంగా చైనా నిలిచింది. ఈ ధైర్యంతో రాబోయే ఎనిమిది సంవత్సరాల్లో కుజుడి ఉపరితలం నుంచి శాంపిళ్లను తెచ్చేందుకు చైనా యత్నిస్తోంది. 2020లో అమెరికా తన సొంత మార్స్‌ మిషన్‌ను చేపట్టింది. 2021లోనే మార్స్‌ పైకి అమెరికా రోవర్‌ దిగింది. ఇప్పటివరకు ఈ రోవర్‌ ఏడు శాంపిళ్లను సేకరించింది.

యూరోపియన్‌ యూనియన్‌ స్పేస్‌ కమిషన్‌తో కలిసి ఈ శాంపిళ్లను 2031 నాటికి భూమిపైకి తీసుకురావాలని నాసా భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే చైనా 2030లో శాంపిళ్లను తెస్తామని ప్రకటించిందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా కన్నా ముందుగా కుజుడి శాంపిళ్లను తీసుకురావడం ద్వారా అంతరిక్ష ఆధిపత్య పోరులో ముందంజలో ఉండాలన్నది చైనా భావన.  

అంతరిక్ష దౌత్యం
ప్రస్తుతం భూమిపైన ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న పోరు నడుస్తోంది. దీన్ని అంతరిక్షంలోకి తీసుకుపోవాలని చైనా భావిస్తోంది. రాబోయే రోజుల్లో అంతరిక్షంపై ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికాకు భిన్నంగా అంతరిక్ష దౌత్య మార్గం ద్వారా ఆధిపత్యం సాధించాలని చైనా యోచిస్తోంది. ఇందులో భాగంగా తన స్పేస్‌ ప్రోగ్రామ్స్‌లో ఇతర దేశాలకు అవకాశాలు ఇస్తోంది.

చైనా నిర్మించే స్పేస్‌ స్టేషన్‌ పూర్తయితే ఇతర దేశాల వ్యోమగాములకు అవకాశాలు కల్పించడం ద్వారా పటిష్టమైన అంతరిక్ష దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలన్నది చైనా భావనగా ఆ దేశానికి చెందిన చైనా డైలీన్యూస్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. ఇది చైనాకు మంచి ప్రజాసంబంధాల వారధి (పబ్లిక్‌ రిలేషన్స్‌–పీఆర్‌)గా పనిచేస్తుందని తెలిపింది.

అంతరిక్ష దౌత్యంలో భాగంగా చిన్న దేశాలకు కృత్రిమ ఉపగ్రహాలను నిర్మించి ఇవ్వడం, తన దగ్గర ఉన్న ఉపగ్రహ డేటాను ఆయా దేశాలతో పంచుకోవడం వంటి చర్యలను చైనా చేపట్టింది. అయితే ఇలాంటి ఆధిపత్య పోరు కన్నా గతంలో సోవియట్, అమెరికా కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించినట్లు చైనా, అమెరికా సంయుక్తంగా పనిచేయడం ప్రపంచం అంతటికీ మేలు చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికాదే పైచేయి
2021లో చైనా అంతరిక్ష ప్రదర్శనల్లో అదరగొట్టింది. కానీ ఇప్పటికీ అంతరిక్షంపై అమెరికా ఆధిపత్యమే నడుస్తోంది. ప్రస్తుతం భూమి చుట్టూ దాదాపు 4,500 కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతుంటే వాటిలో 2,700 ఉపగ్రహాలు అమెరికాకి చెందినవే ఉన్నాయి. అటు చైనా ఉపగ్రహాల సంఖ్య దాదాపు 400 మాత్రమే. అమెరికా వద్ద అత్యంత శక్తివంతమైన రాకెట్లున్నాయి. ఇటీవల కాలంలో చైనా అంతరిక్షంపై పెట్టుబడులను పెంచుతూ వచ్చింది.

2020 నాటికి ఈ రంగానికి చైనా సుమారు 890 కోట్ల డాలర్ల నిధులు కేటాయించింది. కానీ అదే సమయంలో అమెరికా అంతరిక్ష ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు ఏకంగా 4,800 కోట్ల డాలర్లు కావడం విశేషం. అమెరికాలో స్పేస్‌ ఎక్స్‌లాంటి పలు ప్రముఖ ప్రైవేట్‌ అంతరిక్షరంగ సంస్థలు ప్రభుత్వానికి దీటుగా అంతరిక్ష ప్రాజెక్టులు చేపడుతున్నాయి. చైనాలో అంతటిస్థాయి ప్రైవేటు అంతరిక్ష కంపెనీలు ఏర్పడలేదు.

– నేషనల్‌ డెస్క్, సాక్షి

Advertisement
 
Advertisement
 
Advertisement