ఖమేనీ హత్యకు 48 గంటల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ కాల్ వివరాలను రాయిటర్స్ సంచలన నివేదిక వెల్లడించింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు డొనాల్డ్ ట్రంప్ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. నెతన్యాహుతో జరిపిన ఫోన్ కాల్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దాడులు ప్రారంభం కావడానికి 48 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు ఈ కీలక సంభాషణ జరిగినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతం చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని నెతన్యాహు ట్రంప్‌ను ఒప్పించినట్లు రాయిటర్స్ తెలిపింది. అలీ ఖమేనీ తన ముఖ్య అనుచరులతో కలిసి టెహ్రాన్‌లోని తన నివాసంలో సమావేశం కానున్నట్లు ట్రంప్, నెతన్యాహు ఇద్దరికీ ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి.
ఇది "డెకాపిటేషన్ స్ట్రైక్" (అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకునే దాడి) చేయడానికి సరైన సమయమని వారు భావించారు. టెహ్రాన్‌లో జరగాల్సిన సమావేశం శనివారం రాత్రి జరగాల్సి ఉండగా.. శనివారం ఉదయానికి మార్చబడినట్లు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. వెంటనే ఇద్దరు నేతలు ఫోన్ ద్వారా చర్చించుకున్నారు. ఫిబ్రవరి 27న ట్రంప్ తుది ఆదేశాలు ఇచ్చారు. ఫిబ్రవరి 28 ఉదయం మొదటి బాంబులు పడగా.. ఆ సాయంత్రం ట్రంప్ ఖమేనీ మరణాన్ని ప్రకటించినట్లు రాయిటర్స తన రిపోర్ట్‌లో పేర్కొంది.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు తమ స్థావరాల నుంచి గాల్లోకి లేచాయి. రెండు గంటల ఐదు నిమిషాల్లో.. ఇరాన్ కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు టెహ్రాన్‌కు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ఖమేనీ కాంపౌండ్‌ను శిథిలాలుగా మార్చేశాయి. ఖమేనీతోపాటు అక్కడే ఉన్న సైనికాధికారులు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో సైనికాధికారుల ఒక భవనంలో, ఆ పక్కనే మరో భవనంలో ఖమేనీ ఉన్నారు.
ఇజ్రాయెల్ దాడుల్లో ఈ రెండూ నామరూపాల్లేకుండాపోయాయి. లక్ష్యం ఎక్కడా గురితప్పలేదు. అంతా అనుకున్నట్లుగానే పూర్తయ్యింది. ఖమేనీపై దాడికి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతోపాటు అమెరికా క్షిపణులు, డ్రోన్లు కూడా ఉపయోగించినట్లు సమాచారం. అమెరికా యుద్ధనౌకల నుంచి తోమహక్ క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించారు. ఖమేనీ కదలికలను తమ నిఘా వర్గాలు సక్సెస్‌ఫుల్‌గా ట్రాక్ చేశాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.


