Afghanistan: మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు

Taliban Have Banned Co Education In  Afghanistan Herat - Sakshi

తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు  

పాత పరిపాలనను గుర్తు చేస్తూ తాలిబన్లు విధాన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. తాజాగా హెరాత్‌ ప్రావిన్స్‌లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. సమాజంలో అన్ని అనర్థాలకు కోఎడ్యుకేషనే కారణమని, అందుకే దీన్ని నిషేధిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. పలువురు ప్రొఫెసర్లు, ప్రైవేటు కాలేజీల అధిపతులతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబన్‌ వర్గాలు వెల్లడించాయని ఖామా ప్రెస్‌ ఏజెన్సీ తెలిపింది. అఫ్గాన్‌ స్వాధీనం చేసుకున్న అనంతరం తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే! 

చదవండి: తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు

మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు 
ఉన్నత విద్యపై తాలిబన్‌ ప్రతినిధి ముల్లా ఫరీద్‌ మూడుగంటలు ఈ చర్చలు జరిపారు. కోఎడ్‌కు ప్రత్యామ్నాయం లేదని, దీన్ని నిలిపివేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా ఉపాధ్యాయులు కేవలం మహిళా విద్యార్థులకే బోధించాలని, మగ విద్యార్థులకు బోధించకూడదని ఆదేశించారు. పౌర పాలనలో అఫ్గాన్‌ ప్రభుత్వాలు పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు స్థాపించి కోఎడ్‌ను ప్రోత్సహించాయి. తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఇబ్బందులు ఎక్కువని నిపుణులు భావిస్తున్నారు.

అధికారుల లెక్కల ప్రకారం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు, 2వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు. షరియా చట్టం కింద మహిళా హక్కులు గౌరవిస్తామని ఈవారం ఆరంభంలో తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ విలేకరుల సమావేశంలో అట్టహాసంగా ప్రకటించారు. అయితే గతంలో తమ విధానాలనే తాలిబన్లు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top