ఈకల్లో విషం.. తాకితే మరణం.. రెండు రకాల విషపూరిత పక్షులను గుర్తించిన సైంటిస్టులు

Strange birds hide poison in their feathers - Sakshi

కిలకిలరావాలతో అలరించే పక్షులంటే ఇష్టపడనివారు ఎవరుంటారు? బుల్లి పిట్టలను ఇంట్లో పెంచుకోవడం చాలామందికి ఒక చక్కటి అభిరుచి. పిట్టలకు ఆహారం, నీరు అందిస్తూ వాటి ఎదుగుదలను చూసి ఆనందిస్తుంటారు. పక్షులంటే మనుషులకు ప్రియనేస్తాలే. కానీ, ముట్టుకుంటే చాలు క్షణాల్లో ప్రాణాలు తీసే భయంకరమైన రెండు రకాల పక్షులను న్యూగినియా అడవుల్లో డెన్మార్క్‌ పరిశోధకులు గుర్తించారు. అవి వాటి ఈకల్లో విషం దాచుకుంటున్నట్లు కనిపెట్టారు. వాటిని ఇంట్లో పెంచుకోలేం, ఆహారం ఇవ్వలేం. విషపూరిత పక్షుల సమీపంలోకి వెళ్లడం కూడా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు.  

► అడవుల్లో విషపూరిత ఫలాలు, పదార్థాలను ఆరగించి, వాటిని న్యూరోటాక్సిన్లుగా మార్చి, తన రెక్కల్లో నిల్వ చేసుకొనే సామర్థ్యం ఈ పక్షుల్లో అభివృద్ధి చెందింది.
► విష ప్రభావాన్ని తట్టుకొని జీవించే శక్తి సమకూరింది.  
► కాలానుగుణంగా వాటి శరీరంలో సంభవించిన జన్యుపరమైన మార్పులే ఇందుకు కారణమని డెన్మార్క్‌లోని నేచురల్‌ హస్టరీ మ్యూజియం ప్రతినిధి  జాన్సన్‌ చెప్పారు.   
► ఇటీవల న్యూగినియా అడవుల్లో పర్యటన సందర్భంగా ఈ పక్షులను గుర్తించామని ఒక ప్రకటనలో వెల్లడించారు.   
► తాజాగా గుర్తించిన రెండు రకాల విషపూరిత పక్షులు రిజెంట్‌ విజ్లర్‌(పచీసెఫాలా స్లీ్కగెల్లీ), రఫోస్‌–నేప్డ్‌ బెల్‌బర్డ్‌(అలిడ్రియాస్‌ రుఫినుచా) అనే పక్షి జాతులకు చెందినవి. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో ఈ జాతులు అధికంగా కనిపిస్తుంటాయి.  
► సౌత్, సెంట్రల్‌ అమెరికాలో ఉండే డార్ట్‌ కప్పలు (గోల్డెన్‌ పాయిజన్‌ ఫ్రాగ్స్‌) అత్యంత విషపూరితమైనవి చెబుతుంటారు. ఈ కప్పలను తాకితే కొద్దిసేపట్లోనే మరణం సంభవిస్తుంది.  
► డార్ట్‌ కప్పల్లోని విషం లాంటిదే ఈ పక్షుల్లోనూ ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు.  
► పక్షుల్లో బాట్రాసోటాక్సిన్‌ అనే విషం అధిక మోతాదులో ఉందని సైంటిస్టులు పేర్కొన్నారు.  
► ఇలాంటి విషమే గోల్డెన్‌ పాయిజన్‌ కప్పల చర్మంలో ఉంటుంది.
► విషం నిల్వ ఉన్న ఈ పక్షుల ఈకలను తాకితే కండరాల్లో పక్షవాతం లాంటిది ఏర్పడుతుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతోంది. చివరకు మృత్యువు కాటేస్తుంది. ఇదంతా క్షణాల
వ్యవధిలోనే జరిగిపోతోంది.  
► పక్షుల శరీరంలో సోడియం చానళ్లను క్రమబద్ధం చేసే ప్రాంతాల్లో మ్యుటేషన్స్‌(మార్పులు) వల్ల వాటిలో విషాన్ని తయారు చేసుకొని నిల్వచేసుకోవడంతోపాటు తట్టుకొనే శక్తి స్వతంత్రంగానే అభివృద్ధి చెందిందని సైంటిస్టులు పేర్కొన్నారు.  
        
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top