మనం రోజూ ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో వనరులను వాడుతున్నాం. స్విచ్ వేస్తే వెలిగే కరెంట్, కుళాయి తిప్పితే వచ్చే నీరు, మనం కొనే బట్టలు, వాడే ప్లాస్టిక్.. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మనం వాడుతున్న ఈ వనరులు భూమి మీద శాశ్వతంగా ఉంటాయా? రీసెంట్ గా జరిగిన ఒక భయంకరమైన స్టడీ మనల్ని హెచ్చరిస్తోంది. మనం గడుపుతున్న ఈ విలాసవంతమైన జీవనశైలి ఇలాగే కొనసాగితే, మన అవసరాలు తీరడానికి ఒక భూమి సరిపోదు.. మనకి ఇంకో భూమి కావాలి! అవును, మీరు విన్నది నిజం. "వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఎర్త్". అసలు ఈ స్టడీ ఏం చెబుతోంది? మన భవిష్యత్తు ఏంటి?
శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, భూమి తన వనరులను తిరిగి ఉత్పత్తి చేసే వేగం కంటే, మనం వాటిని వాడే వేగం చాలా రెట్లు ఎక్కువగా ఉంది. దీనినే 'ఎకలాజికల్ ఫుట్ ప్రింట్' అంటారు. మనం ఏటా భూమి మనకి ఇచ్చే కోటాను ఆగస్టు నెల నాటికే వాడేస్తున్నాం. మిగిలిన నాలుగు నెలలు మనం భవిష్యత్తు తరాలకు చెందాల్సిన వనరులను అప్పుగా వాడుకుంటున్నాం. మనం వాడే నీరు, మనం పారవేసే వ్యర్థాలు, గాలిలోకి వదులుతున్న కార్బన్.. ఇవన్నీ కలిసి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి.
నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇంట్లో ఏసీ, బయట కారు.. ఉంటున్నాయి. ఇవి మనకి సౌకర్యాలే కానీ, భూమికి మాత్రం భారాలు. ఒక్క ఐఫోన్ తయారీకి ఎన్ని వనరులు కావాలో తెలుసా? మనం వాడే ఫాస్ట్ ఫ్యాషన్ బట్టల వల్ల ఎన్ని కోట్ల లీటర్ల నీరు వృధా అవుతుందో ఊహించగలరా? ఈ రిపోర్ట్ ఏం చెబుతుందంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా అంతా అమెరికా లేదా యూరోపియన్ దేశాల స్థాయి జీవనశైలిని పాటిస్తే, మనకు కనీసం రెండున్నర గ్రహాలు అవసరమవుతాయి. కానీ మన దగ్గర ఉన్నది ఒకే ఒక్క గ్రహం.. మన భూమి! వనరుల తరుగుదల అంటే కేవలం నీరు, ఆహారం అయిపోవడం మాత్రమే కాదు.
దీని వల్ల వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయి. అడవుల నరికివేత వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగి, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల సముద్ర మట్టాలు పెరిగి భవిష్యత్తులో ముంబై, న్యూయార్క్ లాంటి తీర ప్రాంత నగరాలు నీట మునిగే ప్రమాదం ఉంది. అకాల వర్షాలు, భయంకరమైన కరువులు ఇవన్నీ ప్రకృతి మనకు ఇస్తున్న ముందస్తు హెచ్చరికలు. మనం భూమిని రక్షించకపోతే, భూమి మనల్ని శిక్షించడం మొదలుపెడుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం ఆదిమానవుల్లా అడవుల్లోకి వెళ్ళిపోవాలా? అవసరం లేదు.
కానీ మన అలవాట్లను మార్చుకోవాలి. వాటిలో ప్రధానంగా అవసరమైన దానికంటే ఎక్కువ వనరులను వాడటం ఆపేయాలి. 'నీరు' , 'విద్యుత్తు' విషయంలో పొదుపుగా ఉండాలి. అలాగే వాడి పారేసే సంస్కృతి నుండి వస్తువులను మళ్ళీ మళ్ళీ వాడే అలవాటు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అంతేకాదు విదేశీ వస్తువుల కంటే స్థానికంగా దొరికే ఆహారం, వస్తువులను ప్రోత్సహించడం వల్ల ట్రాన్స్‌పోర్ట్ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వీటన్నిటికన్నా ప్రధానంగా కనీసం మన వంతుగా మొక్కలు నాటడం, ప్రకృతిని గౌరవించడం నేర్చుకోవాలి.
.మనకి నివసించడానికి 'ప్లాన్ బి' లేదు. ఎందుకంటే మనకి ఇంకో గ్రహం లేదు. మార్స్ మీద ఇల్లు కట్టుకోవచ్చని మనం కలలు కనవచ్చు కానీ, కోట్లాది మంది సామాన్యులకు ఈ భూమే ఆధారం. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి కేవలం డబ్బు మాత్రమే కాదు.. వారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి, తాగడానికి స్వచ్ఛమైన నీరు. ఆ బాధ్యత మనందరిదీ.ఈ రోజే మీ జీవనశైలిలో ఒక చిన్న మార్పు చేయండి. భూమిని రక్షించండి.. అది మనల్ని రక్షిస్తుంది.


