ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో కనీసం ఎనిమిది మంది మరణించగా, మరో 34 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీ ఖండించారు. యుద్ధరంగం నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ పారిశ్రామిక కేంద్రమైన ద్నీప్రో నగరంపై రష్యా దళాలు తరచూ దాడులు చేస్తున్నాయని అధికారులు తెలిపారు.
అయితే చనిపోయిన బాధితుల్లో ఒకరు 13 ఏళ్ల బాలిక అని ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ హంజా టెలిగ్రామ్ సందేశంలో తెలిపారు. పగిలిన కిటికీలతో ఉన్న ఒక భవనం చిత్రాలను, మెట్ల దగ్గర పడి ఉన్న మృతదేహం అస్పష్టమైన ఫోటోను ఆయన పంచుకున్నారు.ఇక జపోరిజ్జియాపై జరిగిన డ్రోన్ దాడిలో కనీసం ముగ్గురు మరణించగా, ఒక చిన్నారితో సహా మరో ఆరుగురు గాయపడ్డారని జెలెనెస్కీ తెలిపారు.
సుమీ, ఒడెసా, చెర్నిహివ్, ఖేర్సన్, ఖార్కివ్ ప్రాంతాలలో కూడా రష్యా దాడులు నిర్వహించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించారు. 2024లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మాస్కో తమవని చెప్పుకుంటున్న నాలుగు ప్రాంతాల నుంచి కీవ్ బలగాలు వైదొలగాలని, అలాగే నాటోలో చేరాలన్న తమ ప్రణాళికలను బహిరంగంగా విరమించుకోవాలని చెప్పినప్పటి నుంచి శాంతి ఒప్పందంపై రష్యా వైఖరి మారలేదని క్రెమ్లిన్ సోమవారం తెలిపింది.
పోరాటాన్ని తగ్గించాలన్న ఉక్రెయిన్ కొత్త ప్రతిపాదనను తిరస్కరిస్తూ, ఆ ప్రాంతాలపై పూర్తి నియంత్రణ సాధించాలన్న లక్ష్యంతో రష్యా ముందుకు సాగుతుందని వారాంతంలో ఒక టెలివిజన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ పేర్కొన్నారు. సుదూర దాడులను పరస్పరం నిలిపివేయాలని, పోరాటాన్ని డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, పోరిజ్జియా అనే నాలుగు ప్రాంతాలకే పరిమితం చేయాలని కీవ్ ప్రతిపాదించిందని పుతిన్ చెప్పారు.


