మా గడ్డపై రష్యా ఆటలు సాగవ్‌

Russia-Ukraine war: Ukraine We recaptured the territories occupied by Russia - Sakshi

రష్యా ఆక్రమించిన ప్రాంతాలను మళ్లీ స్వాధీనం చేసుకున్నాం: ఉక్రెయిన్‌ సైన్యం స్పష్టీకరణ

కీవ్‌: తమ భూభాగంలో రష్యా ఆటలు సాగవని ఉక్రెయిన్‌ సైన్యం తేల్చిచెప్పింది. ఉక్రెయిన్‌ దక్షిణాదిన రష్యా ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలను తాము మళ్లీ స్వాధీనం చేసుకున్నామని గురువారం ప్రకటించింది. తూర్పు ప్రాంతంలోనూ పుతిన్‌ సేనల దాడులను సమర్థంగా తిప్పికొట్టామంది. రష్యా సరిహద్దుల్లో ఉన్న ఖేర్సన్, మైకోలైవ్‌లో పలు ప్రాంతాలు తమ అధీనంలోకి వచ్చాయని, డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌లో రష్యా దాడులను తిప్పికొట్టామని వెల్లడించింది. మరోవైపు మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఇరువర్గాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. 

అయితే, అజోవ్‌స్టల్‌ ఉక్కు కర్మాగారంలోప్రతిఘటన ఎదురుకావడం లేదని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించి ఏడు వారాలు దాటినా కీలకమైన పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్‌పై రష్యాకు పూర్తిగా పట్టుచిక్కలేదు. పశ్చిమ దేశాల నుంచి ఆయుధాలు, సామగ్రి ఉక్రెయిన్‌ను రాకుండా నిరోధించడానికి రైలు, రోడ్డు మార్గాలను రష్యా ధ్వంసం చేస్తోంది. అత్యాధునిక రష్యా యుద్ధట్యాంకు టి–90ఎంను ఉక్రెయిన్‌ దళాలు పేల్చివేశాయి.  ఈ ట్యాంకు విలువ రూ.37కోట్ల్లని అంచనా. రష్యాకు చెందిన థర్మోబారిక్‌ మల్టిపుల్‌ రాకెట్‌ సిస్టమ్‌ను కూడా ఉక్రెయిన్‌ ధ్వంసం చేసింది.

ఉక్రెయిన్‌కు విరాళాల వెల్లువ
ఉక్రెయిన్‌ కోసం వార్సాలో గురువారం ఇంటర్నేషనల్‌ డోనర్స్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6.5 బిలియన్‌ డాలర్ల(రూ.49 వేల కోట్లు) మేర విరాళాలు అందినట్లు పోలండ్‌ ప్రధాని మొరావీకీ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు గూగుల్‌ వంటి ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్‌ హాజరై భారీగా విరాళాలు ప్రకటించారని చెప్పారు ‘యునైటెడ్‌24’ పేరిట నిధుల సేకరణను ప్రారంభిస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు.  

ఇక ‘ప్రత్యేక మిలటరీ ఆపరేషన్‌’
ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తూనే ఉంది. డోన్బాస్‌ ప్రాంతంలోని నగరాలు, పట్టణాల్లో గత 24 గంటల్లో రష్యా దాడుల్లో ఐదుగురు మరణించారని, మరో 25 మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. కీవ్‌ శివార్లతోపాటు చెర్కాసీ, జాపొరిజాజియాలో బాంబు మోతలు వినిపించాయి. డినిప్రోలో రష్యా దాడుల్లో రైల్వే స్టేషన్‌ దెబ్బతింది. పశ్చిమ దేశాలు చేరుకోవడానికి ముఖద్వారం లాంటి లెవివ్‌లోనూ దాడులు కొనసాగాయి.

మరోవైపు ఈ నెల 9న ‘విక్టరీ డే’ జరుపుకొనేందుకు రష్యా బలగాలు సిద్ధమవుతున్నాయి. నాజీ జర్మనీపై సోవియట్‌ యూనియన్‌ విజయానికి గుర్తుగా ఏటా ఈ వేడుక నిర్వహిస్తుంటారు. 9న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  ఉక్రెయిన్‌ను పూర్తిగా లొంగదీసుకోవడానికి ‘ప్రత్యేక మిలటరీ ఆపరేషన్‌’కు పిలుపునిచ్చే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు.  

బెలారస్‌ సైనిక విన్యాసాలు ప్రారంభం
ఉక్రెయిన్‌లో రష్యా సేనలు తీవ్రంగా చెమటోడుస్తున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదని వాషింగ్టన్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ వార్‌’ ప్రకటించింది. రష్యా మిత్రదేశమైన బెలారస్‌ సైనిక విన్యాసాలు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది.  అయితే, వీటితో ఉక్రెయిన్‌కు ముప్పు ఉంటుందనుకోవడం లేదని బ్రిటన్‌ వివరించింది.

ఉక్రెయిన్‌కు అమెరికా నిఘా సాయం!
ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో రష్యా సైనిక జనరల్స్‌ అంతం కావడంలో అమెరికా హస్తం ఉందా? అమెరికా అందించిన కీలక నిఘా సమాచారంతోనే ఉక్రెయిన్‌ సైన్యం రష్యా జనరల్స్‌ను మట్టుబెట్టిందా? అవుననే అంటోంది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఓ కథనం ప్రచురించింది. రష్యా సైనికాధికారులపై దాడిచేయడంలో ఉక్రెయిన్‌కు  నిఘా సమాచారం చేరవేయడం వాస్తవమేనని సదరు అధికారులు అంగీకరించారు. అమెరికాతోపాటు బ్రిటన్, ఇతర నాటో దేశాలు ఉక్రెయిన్‌కు సహకరిస్తున్న సంగతి బహిరంగ రహస్యమేనని రష్యా ఉద్ఘాటించింది. ఎవరు ఎన్ని విధాలుగా అండగా నిలిచినా తమ లక్ష్యం సాధించితీరుతామని పేర్కొంది. యుద్ధరంగంలో 12 మంది రష్యా జనరల్స్‌ను హతమార్చామని ఉక్రెయిన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top