Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా పాశవికం

Russia-Ukraine war: 60 people killed after bomb hits school in ukraine - Sakshi

జనం ఆశ్రయం పొందుతున్న స్కూల్‌పై బాంబు దాడులు

దాదాపు 60 మంది మృతి!

ప్రైవిలియాలో ఇద్దరు బాలురు బలి

అజోవ్‌స్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ రష్యా వశం

కీవ్‌/లండన్‌/మాస్కో:  రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడులను ఉధృతం చేస్తోంది. సామాన్య పౌరులు తలదాచుకున్న శిబిరాలను కూడా వదిలిపెట్టకుండా బాంబుల వర్షం కురిపిస్తోంది. లుహాన్‌స్క్‌ ప్రావిన్స్‌లోని బిలోహోరివ్‌కా గ్రామంలో ఓ పాఠశాలపై శనివారం రష్యా జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో జనం మరణించినట్లు స్థానిక గవర్నర్‌ సెర్హీ హైడే ప్రకటించారు. ఈ స్కూల్‌లో దాదాపు 90 మంది ఆశ్రయం పొందుతున్నారు. రష్యా బాంబు దాడుల్లో స్కూల్‌ భవనం పూర్తిగా నేలమట్టమయ్యింది.

ఇప్పటిదాకా రెండు మృతదేహాలను గుర్తించామని, 30 మందిని రక్షించామని గవర్నర్‌ తెలిపారు. మరో 60 మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారని, వారంతా మరణించినట్లు నిర్ణయానికొచ్చామని వెల్లడించారు. అలాగే ప్రైవిలియా పట్టణంలో రష్యా దాడుల్లో ఇద్దరు బాలురు బలయ్యారు. మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ను రష్యా సైన్యం దాదాపుగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదని, చివరి క్షణం దాకా పోరాడుతామని ఇక్కడి ఉక్రెయిన్‌ సైనికులు చెబుతున్నారు.స్టీల్‌ప్లాంట్‌ ఉన్న సాధారణ ప్రజలను శనివారం నాటికి పూర్తిగా ఖాళీ చేయించారు. నల్లసముద్ర తీరంలోని అతిపెద్ద ఓడరేవు ఒడెసాపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం అక్కడ పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఖర్కీవ్‌ సమీపంలో ఉక్రెయిన్‌ దళాల ప్రతిదాడుల్లో రష్యా లెఫ్టినెంట్‌ కల్నల్‌ మృతిచెందాడు. దీంతో యుద్ధంలో ఇప్పటిదాకా మరణించిన రష్యా సైనిక ఉన్నతాధికారుల సంఖ్య 39కు చేరింది.  

యూకే అదనపు సాయం 1.3 బిలియన్‌ పౌండ్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉక్రెయిన్‌కు అదనంగా 1.3 బిలియన్‌ పౌండ్ల సైనికపరమైన సాయం అందిస్తామని యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటిష్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌తోపాటు ఇతర జి–7 దేశాల అధినేతలు ఆదివారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రారంభించిన అన్యాయమైన యుద్ధం వల్ల కేవలం ఉక్రెయిన్‌ నష్టపోవడమే కాదు మొత్తం యూరప్‌ భద్రత, శాంతికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని బోరిస్‌ జాన్సన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని తక్షణమే ఆపాలని పుతిన్‌కు హితవు పలికారు.

రష్యా ‘విక్టరీ డే’
రష్యాలో సోమవారం జరిగే విక్టరీ డే వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో నగరాలు, పట్టణాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్‌ యూనియన్‌ విజయానికి గుర్తుగా రష్యాలో ప్రతిఏటా మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. ఈసారి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో విక్టరీ డేకు ప్రా«ధాన్యం పెరిగింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజధాని మాస్కోలోని చరిత్రాత్మక రెడ్‌ స్క్వేర్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొంటారు. పుతిన్‌ ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధ ప్రకటన చేయబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top