నిఘా ఆరోపణలతో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ విలేకరి అరెస్ట్‌

Russia arrests Wall Street Journal reporter Evan Gershkovich - Sakshi

అమెరికా ఆదేశాలతో పనిచేస్తున్నాడని రష్యా ఆరోపణ

మాస్కో: ఉక్రెయిన్‌ యుద్ధంతో బద్ధశత్రువులుగా తయారైన అమెరికా, రష్యాల సంబంధాలు మరింత క్షీణించే పరిణామం ఒకటి సంభవించింది. రష్యాలో విలేకరిగా విధులు నిర్వర్తిస్తున్న అమెరికాకు చెందిన అంతర్జాతీయ వార్తాపత్రిక ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’కు చెందిన ఇవాన్‌ గెర్‌‡్షకోవిచ్‌ను రష్యా నిఘా సంస్థ ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌(ఎఫ్‌ఎస్‌బీ) అరెస్ట్‌చేసింది. రహస్య పత్రాలను సేకరించేందుకు ప్రయత్నించాడని అతనిపై అభియోగాలు మోపింది.

‘అమెరికా ఆదేశాలతోనే నిషేధిత ప్రాంతంలోని తమ సైనిక పారిశ్రామికవాడలోని ఒక సంస్థకు చెందిన రహస్య పత్రాలను సేకరించడంలో ఇవాన్‌ బిజీగా ఉన్నాడు. అందుకే అరెస్ట్‌చేశాం’ అని ఎఫ్‌ఎస్‌బీ గురువారం ప్రకటించింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ మాస్కో బ్యూరోలో కరస్పాండెంట్‌గా పనిచేసే ఇవాన్‌ ఉక్రెయిన్, రష్యా, ఇతర సోవియట్‌ యూనియన్‌ దేశాల్లో వార్తల కవరేజీ విధులు నిర్వర్తిస్తున్నాడు. రష్యా మోపిన నేరం రుజువు అయితే గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

తమ విలేకరి అరెస్ట్‌ను వార్తాసంస్థ తీవ్రంగా ఖండించింది. కోల్డ్‌ వార్‌ తర్వాత అమెరికా రిపోర్టర్‌ను రష్యా అరెస్ట్‌చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇవాన్‌ను ఏ తేదీలో అరెస్ట్‌చేసిందీ ఎఫ్‌ఎస్‌బీ వెల్లడించలేదుగానీ ఉరాల్‌  పర్వతాల దగ్గర్లోని ఎకటిన్‌బర్గ్‌ నగరంలో అతడిని అరెస్ట్‌చేసినట్లు తెలుస్తోంది.  ఖైదీల పరస్పర మార్పిడిలో భాగంగా జైళ్లలో ఉన్న రష్యా ఆయుధ మధ్యవర్తి విక్టర్‌ బౌట్‌ను, డబ్ల్యూఎన్‌బీఏ స్టార్‌ బ్రిట్నీ గ్రీనర్‌ను రష్యా, అమెరికాలు మార్చుకున్న విషయం విదితమే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top