Pakistan: భారీ భూకంపం.. 11 మంది మృతి.. 170 మందికి పైగా గాయాలు

Powerful Earthquake Several Killed Injured In In Pakistan Afghanistan - Sakshi

పాకిస్తాన్‌ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన దాయాది దేశంలో నిత్యావసర నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. పాలు, కూరగాయలు, పెట్రోల్‌, డీజిల్‌ వంటి ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతుండటంతో ఏం కొనలేక, తినలేక పాక్‌ ప్రజలు అల్లాడుతున్నారు. అడుగడుగున కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు ప్రకృతి విపత్తు రూపంలో మరో ఆపద చుట్టుముట్టింది.

పాకిస్తాన్‌, అఫ్గనిస్తాస్తాన్‌లో పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.5గా నమోదైంది. రాత్రి 10.20 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భవనాలు దెబ్బతినడం, కొండచరియలు విరిగిపడడంతో నివాసితులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాక్‌లో భూకంపం దాటికి ఇద్దరు మహిళలు సహా ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా 160 మందికిపైగా గాయపడ్డారు. అఫ్గనిస్తాన్‌  ఈశాన్య లాగ్మాన్ ప్రావిన్స్‌లో ఇద్దరు మరణించగా ఎనిమిదిమంది గాయపడ్డారు.

అఫ్గనిస్తాన్‌లోని హిందూకుష్‌ ప్రాంతం భూ ఉపరితలం నుంచి 187 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. లాహోర్‌, ఇస్లామాబాద్‌, రావల్పిండి, క్వెట్టా, పెషావర్‌, కోహట్‌, లక్కీ మార్వాట్‌ సహా పలు ప్రాంతాల్లో భూకంపం నమోదైనట్లు పేర్కొంది. అదే విధంగా  గుజ్రాన్‌వాలా, గుజరాత్‌, సియాల్‌కోట్‌, కోట్‌ మోమిన్‌, మద్‌ రంఝా, చక్వాల్‌, కోహట్‌, గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతాల్లో కూడా బలమైన ప్రకంపనలు వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

భూకంప విపత్తుపై స్పందించిన పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులను ఆదేశించారు. అయితే పాక్‌లో భూకంపాలు సర్వసాధారణం. ఈ ఏడాది జనవరిలో ఇస్లామాబాద్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 2005లో దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం 74,000 మందికిపైగా పొట్టనపెట్టుకుంది. 

అంతర్జాతీయ భూకంప కేంద్రం ప్రకారం.. పాకిస్తాన్‌తో పాటు, భారతదేశం, అఫ్గానిస్తాన్‌, తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిజిస్తాన్‌లలో కూడా ప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లోనూ మంగళవారం రాత్రి భారీ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీలో సుమారు 2 నిమిషాల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఇళ్లు, భవనాలు కదలడంతో తీవ్ర భయాందోళనకు గురైన జనాలు బయటకు పరుగులు తీశారు.

హరియాణా, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్‌ కశ్మీర్‌ తదితర రాష్ట్రాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలియరాలేదు. భూకంపం వల్ల జమ్మూలో కొన్ని ప్రాంతాల్లో మొబైల్‌ ఫోన్ల సేవలకు అంతరాయం కలిగింది. అఫ్గానిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడయ్యింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top