ఇస్లామాబాద్:పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ ఏ క్షణమైనా మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనిక బలగాలను పంపింది. సైనికులతో పాటు ఫైటర్ జెట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా పంపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. అయితే, ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఇరాన్‌తో సాంస్కృతిక, భౌగోళిక సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్ సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఒప్పందం ప్రకారం, ఇరాన్ దాడులు చేస్తే తిప్పికొట్టేలా సైన్యం, యుద్ధ విమానాలను సౌదీకి పంపినట్లు భద్రతా అధికారులు ధృవీకరించారు. గతేడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. వాటిలో ప్రత్యర్థి దేశాల దాడుల సమయంలో ఒకరికొకరు అండగా నిలబడాలని నిబంధనలు ఉన్నాయి. పాకిస్థాన్-సౌదీ రక్షణ ఒప్పందం పూర్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ, ఒకరిపై దాడి జరిగితే మరొకరు రక్షణకు రావాల్సి ఉంటుందని ప్రకటించారు. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఈ ఒప్పందం సౌదీ అరేబియాను పాకిస్థాన్ అణు కవచం కింద ఉంచుతుందని సూచించారు.
సమాచారం ప్రకారం, పాకిస్థాన్ ఏప్రిల్ ప్రారంభంలో 16 జేఎఫ్-17 యుద్ధ విమానాలు, రెండు డ్రోన్ స్క్వాడ్రన్లు, హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను సౌదీకి పంపింది. ఈ మోహరింపులో 8,000 సైనికులు ఉన్నారు. అవసరమైతే మరిన్ని సైనికులను పంపుతామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది.
ఘర్షణ సమయంలో పంపిన సైనికులు, వైమానిక దళ సిబ్బంది ప్రధానంగా సలహా, శిక్షణ పాత్ర పోషిస్తారని అధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం గరిష్టంగా 80,000 పాకిస్థాన్ సైనికులను సౌదీకి పంపే అవకాశం ఉంది. అదనంగా యుద్ధ నౌకలు పంపే అంశం కూడా ఒప్పందంలో ఉంది.
ఈ మోహరింపు ప్రతీకాత్మకంగా కాకుండా, యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, వేలాది సైనికులతో కూడిన పెద్ద స్థాయి చర్య అని వర్గాలు పేర్కొన్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, సౌదీ ఇరాన్‌పై గోప్య దాడులు జరిపింది. పాకిస్థాన్ గతంలో కూడా సౌదీకి సైనిక శిక్షణ, సలహా అందించింది. మరోవైపు, సౌదీ పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థిక సహాయం అందించింది.


