భూమిలోకి కుంగిపోతున్న మెక్సికో సిటీ  | Mexico City Sinking Rapidly By Up To 10 Inches A Year, NASA Satellite Data Reveals, Check More Details Inside | Sakshi
Sakshi News home page

భూమిలోకి కుంగిపోతున్న మెక్సికో సిటీ 

May 2 2026 4:45 AM | Updated on May 2 2026 10:05 AM

Mexico City is sinking by about 25 centimetres a year

ప్రతిఏటా 10 అంగుళాల చొప్పున కిందికి..  

అమెరికా ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తింపు  

భూగర్భ జలాల విచ్చలవిడి వినియోగం వల్లే సమస్య  

సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్న ప్రజలు 

మెక్సికో సిటీ: ఉత్తర అమెరికా ఖండంలోని మెక్సికో దేశ రాజధాని మెక్సికో సిటీ క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. ప్రతిఏటా 10 అంగుళాల చొప్పున కుంగిపోతున్నట్లు నిపుణులు గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ఈ వారం విడుదల చేసిన కొత్త ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ విషయం తేల్చారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా కుంగిపోతున్న మహానగరాల్లో ఒకటిగా మెక్సికో సిటీ నిలుస్తోంది.

 ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన, జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ఈ సిటీ విస్తీర్ణం 7,800 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ సుమారు 2.2 కోట్ల జనాభా నివసిస్తోంది. మెక్సికన్‌ సిటీ, దాని చుట్టుపక్కల నగరాలు ఒక పురాతన లేక్‌ బెడ్‌పై నిర్మితమయ్యాయి. ఈ సిటీలో అనేక వీధులు ఒకప్పుడు కాలువలుగా ఉండేవి. కాలువలు పూడ్చేసి రహదారులు నిర్మించారు.  

మరో వందేళ్లలో 39 అడుగులు!  
భూగర్భ జలాల విచ్చలవిడి వినయోగం, పట్టణాభివృద్ధి చర్యల కారణంగా భూగర్భ జలవనరులు గణనీయంగా తగ్గిపోయాయి. దాంతో మెక్సికో సిటీ ఒక శతాబ్దానికి పైగా కుంగిపోతోంది. 1573లో నిర్మాణం ప్రారంభమైన మెట్రోపాలిటన్‌ కేథడ్రల్‌ వంటి అనేక స్మారక చిహా్నలు. పురాతన భవనాలు స్పష్టంగా ఒక వైపుకు వంగిపోయి కనిపిస్తున్నాయి. క్షీణిస్తున్న భూగర్భ జలవనరులు కూడా దీర్ఘకాలిక నీటి సంక్షోభానికి కారణమయ్యాయి.

 ఈ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. మెక్సికో సిటీ వేగంగా కుంగిపోతుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాన్ని అంతరిక్షం నుంచి కూడా గుర్తించవచ్చు. పరిస్థితి తీవ్రతను దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. నాసా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మెక్సికో సిటీలో కొన్ని ప్రాంతాలు నెలకు సగటున 0.78 అంగుళాల చొప్పున కుంగిపోతున్నాయి. ఎయిర్‌పోర్టుతోపాటు కొన్ని ప్రధాన కట్టడాలు ఆయా ప్రాంతాల్లోనే ఉన్నాయి. 

కుంగుబాటు రేటు ఏడాదికి కనీసం 9.5 అంగుళాలుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరో వందేళ్లలో నగరం 39 అడుగుల మేర కుంగిపోవచ్చని అంచనా వేస్తున్నారు. మెక్సికో సిటీపై నాసా 2025 అక్టోబర్‌ నుంచి 2026 జనవరి వరకు అధ్యయనం చేసింది. ఇందుకోసం శక్తివంతమైన నిసార్‌ ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించింది. మెక్సికో సిటీ భూమి కుంగిపోయే సమస్యను పరిష్కరించడంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేయడం వల్లే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చిందని అంటున్నారు.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement