శవం కూడా దక్కది అనుకుంటే.. మృత్యుంజయురాలిగా మళ్లీ ఈ లోకంలోకి..

Meet Lily Kryzhanivskyy Who Survived From Rare Cougar Attack - Sakshi

వాషింగ్టన్‌: పాలబుగ్గల చిన్నారి.. స్నేహితులతో ఆటల్లో మునిగిపోయింది. సరదాగా హైడ్ అండ్‌ సీక్‌ ఆడుతూ.. ఒక్కసారిగా చెట్టు చాటు నుంచి స్నేహితురాలిని సర్‌ప్రైజ్‌ చేద్దాం అనుకుంది. కానీ, ఊహించని సర్‌ప్రైజ్‌ ఆమెకు ఎదురైంది. ఆమె జీవితాన్ని ఛిద్రం చేసింది. అదృష్టంకొద్దీ ప్రాణం మిగలడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 

లిల్లీ క్రైజానివిస్కీ.. వయసు తొమ్మిదేళ్లు. ఐదు రోజుల కిందటి వరకు ఆమె జీవితం మిగతా వాళ్లలాగే సరదాగా గడిచింది. కానీ, ఇప్పుడు ఆమె ఆస్పత్రి బెడ్‌పై సగం చిధ్రమైన స్థితిలో పడి ఉంది. ఓ కౌగర్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి.. మృత్యువు ముఖం నుంచి బయటపడింది.

కౌగర్‌.. పిల్లి జాతికి చెందిన భారీ జంతువు.. మౌంటెన్‌ లయన్‌. బరువు 35 నుంచి 115 కేజీల మధ్య ఉంటుంది. ఇవి దాడి చేస్తే మనుషి బతకడం చాలా కష్టం. 1924 నుంచి వాషింగ్టన్‌ స్టేట్‌లో 20 మందిపై దాడులు చేశాయి ఇవి. దాడి చేస్తే రక్తమాంసాలు కూడా మిగల్చకుండా తినేస్తాయి. అలాంటి క్రూర జంతువు దాడిలో గాయపడి.. బతకడం లిల్లీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. 

లిల్లీ కుటుంబం వెస్ట్రన్‌ యునైటెడ్‌ స్టేట్స్‌కు విహారయాత్రకు వెళ్లింది. అధికారులను హెచ్చరికలను ఆ కుటుంబాలు పట్టించుకోలేదు. పిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపించారు.  అక‍్కడే స్నేహితులతో ఆడుకుంటున్న టైంలో.. ఆ చిన్నారిపై కౌగర్‌ దాడి చేసింది. ముఖంతో పాటు మొత్తం ఆ చిన్నారిని చీల్చి పడేసింది. నోట కరుకుకుని లాక్కుని పోయింది. ఆ హఠాత్‌ పరిణామంతో తోటి పిల్లలు గట్టి గట్టిగా అరిచారు. అంతా వచ్చి చూసేసరికి రక్తపు మరకలు తప్ప బిడ్డ కనిపించలేదు.

అంతా కలిసి వెతకగా.. కొద్దిదూరంలో రక్తపు మడుగులో పడి ఉంది ఆ చిన్నారి దేహం.  అధికారుల సాయంతో వెంటనే లిల్లీని ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించారు. ఆమె ముఖం, శరీర పైభాగం దాడిలో ఘోరంగా దెబ్బతింది. చిన్నారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకునేందుకు ఆ కుటుంబానికి డబ్బు అవసరం పడింది. అందుకే ఆమె అంకుల్‌ గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరించారు. చిన్నారి పరిస్థితిని ఫొటోల ద్వారా చూసి చలించి.. విరాళాలు ధారల వెల్లువెత్తాయి. మొత్తానికి సోమవారం సర్జరీ జరిగింది. ఐసీయూ నుంచి, అంతకు మించి కోమా నుంచి లిల్లీ బయటకు వచ్చింది. కానీ, ఆమె మామూలుగా తిరగగలుతుందా? అనేది మాత్రం ఆరునెలలు గడిచాకే చెబుతాం అంటున్నారు వైద్యులు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top