Man Saved Injured Cockroach In Thailand: మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు - Sakshi
Sakshi News home page

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు

Jun 7 2021 3:20 PM | Updated on Jun 7 2021 6:30 PM

Man Carries Injured Cockroach to A Hospital in Thailand - Sakshi

తీవ్రంగా గాయపడిన బొద్దింకను ఆస్పత్రికి తీసుకెళ్తున్న దను

గాయాలతో చావుబతుకులతో పోరాడుతున్న దాన్ని బతికించేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు.

బ్యాంకాక్‌: మనిషి జీవితంలో ఆస్తులు సంపాదించడం ఎంత కష్టమో.. ఒక్కసారి అనారోగ్యం పాలైతే అన్నేళ్లు సంపాదించుకున్న ఆస్తులన్ని హరించుకుపోవడమే కాక.. కొత్తగా అప్పుల పాలవ్వడం కూడా అంతే సహజం. ఏం చేస్తాం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఉండరు.. సదుపాయాలుండవు.. చేతిలో రూపాయి లేకపోతే ప్రైవేట్‌ ఆస్పత్రులు దరిదాపులకు కూడా రానివ్వవు. మనుషులమయ్యిండు సాటివారి పట్ల ఏమాత్రం మానవత్వం చూపించని రోజలు ఇవి. అలాంటిది ఇక మూగజీవులను పట్టించుకుంటామా..

అయితే అందరు ఇలానే ఉంటారా అంటే కాదు.. అక్కడక్కడ మానవత్వం మెండుగా ఉన్న వారు.. తోటి వారి గురించి ఆలోచించే వారు ఉంటారు. ఈ కోవకు చెందిన వాడే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి. ఇతగాడు గాయపడిన బొద్దింక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అతడి మంచి మనసు చూసి కదిలిపోయిన డాక్టర్‌ ఆ బొద్దింకను ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నారు. గాయాలతో చావుబతుకులతో పోరాడుతున్న దాన్ని బతికించేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. అయితే, అది మనుషుల హాస్పిటల్ కాదులెండి.. పశువుల ఆస్పత్రి. ఆ వివరాలు.. 

థాయ్‌లాండ్‌లోని క్రతుమ్ బ్యాన్ ప్రాంతానికి చెందిన దను లింపపట్టనవానిచ్ అనే యువకుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. అతడికి ఓ బొద్దింక కనిపించింది. ఎవరో దాన్ని పొరపాటున తొక్కేశారు. తీవ్రంగా గాయపడిన ఆ బొద్దింక అక్కడి నుంచి కదల్లేక విలవిల్లాడుతోంది. దాని పరిస్థితి చూసి దను మనసు కరిగిపోయింది. దాన్ని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు.

వెంటనే ఆ బొద్దింకను తన అరచేతిలో పెట్టుకుని సాయి రాక్ యానిమల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అదేంటీ ఇతడు బొద్దింకను తీసుకొచ్చారని.. అక్కడ ఎవరూ ఎగతాళి చేయలేదు. ఆ హాస్పిటల్‌లోని డాక్టర్ లింపపట్టనవానిచ్ కూడా ఆ బొద్దింకను ఎమర్జెన్సీ పేషెంట్‌గానే భావించాడు. దానికి ఉచితంగా వైద్యం చేస్తానని దనుకు మాటిచ్చాడు.

ఈ అరుదైన ఘటన గురించి ఆ డాక్టరే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఆ బొద్దింక బతికేందుకు 50-50 చాన్సులు మాత్రమే ఉన్నాయని డాక్టర్ తెలిపాడు. ‘‘ఇది జోక్ కాదు. ఇది ప్రతి జీవి పట్ల కరుణ, జాలిని సూచిస్తుంది. ప్రతి జీవి ప్రాణం విలువైనదే. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు మరింత మంది ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచానికి దయ కలిగిన మనుషులు ఎంతో ముఖ్యం’’ అని పేర్కొన్నాడు.

‘‘ఇప్పటివరకు బొద్దింకను రక్షించమని ఎవరూ రాలేదు. ఇలా జరగడం నా సర్వీసులో ఇదే మొదటి సారి. ముఖ్యంగా.. ఇలాంటి చిన్న జీవికి ఎప్పుడూ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. దాన్ని బతికించడం నాకు ఛాలెంజ్ అనిపించింది. ఎందుకంటే.. అంత చిన్న జీవికి ఆక్సిజన్ అందించడం అంత సులభం కాదు. అందుకే దాన్ని ఆక్సిజన్‌ కంటైనర్‌లో పెట్టాం. దానివల్ల కనీసం అది ఊపిరి పీల్చుకుని బతికే అవకాశాలు ఉంటాయని భావించాం. ఆ బొద్దింక ప్రాణాలతో బయటపడిన తర్వాత.. నువ్వే బాగోగులు చూసుకోవాలని అతడికి చెప్పాను. ఇందుకు అతడు అంగీకరించాడు’’ అని డాక్టర్ తెలిపాడు.

అయితే, ఆ బొద్దింక బతికిందా.. లేదా చనిపోయిందా అనేది మాత్రం ఆయన తెలపలేదు. ఈ సంఘటన పట్ల నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న జీవి పట్ల ఎంతో గొప్ప ఉదారత చూపావు.. నీ మంచి మనసుకు హ్యాట్సాఫ్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

చదవండి: బొద్దింక దెబ్బకు హడలెత్తిన కొత్త జంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement