లవ్‌ ప్రపోజ్‌, షాకిచ్చిన యూనివర్సిటీ అధికారులు

Lahore University Proposal Video: Students Expelled For Hugging - Sakshi

లాహోర్‌: ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమను వ్యక్తీకరించడం గొప్ప అంటుంటారు. కానీ ఇలా ఏకంగా చదువుల నిలయమైన యూనివర్సిటీలో ప్రపోజ్‌ చేసుకోవడం కొంత ఆశ్చర్యకరమే! అందులోనూ అందరి ముందే హగ్గులిస్తూ ప్రేమలో తూలి తేలిపోవడం మరింత విడ్డూరకరం. ఈ అరుదైన ఘటన పాకిస్తాన్‌లోని లాహోర్‌ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. ఇద్దరు ప్రేమ పక్షులు వారి మనసులోని భావాలను ఒకరికొకరు చెప్పుకునేందుకు క్యాంపస్‌నే ఎంచుకున్నారు. అందరూ చూస్తుండగానే యువతి మోకాలిపై కూర్చుని మనసు పడ్డ వ్యక్తికి పువ్వులు ఇస్తూ ప్రపోజ్‌ చేసింది. దీంతో అతడు ఆమెను అక్కున చేర్చుకుని కౌగిలితంల్లో బంధించాడు. దీన్నంతటినీ అక్కడున్న విద్యార్థులు ఫోన్లలో చిత్రీకరించారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూనివర్సిటీ అధికారులు ఆ ఇద్దరినీ తమముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను వారు బేఖాతరు చేశారు. దీంతో క్రమశిక్షణారాహిత్యం కింద వారిని యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు, వారు యూనివర్సిటీకి సంబంధించిన ఏ క్యాంపస్‌లోనూ అడుగు పెట్టేందుకు వీల్లేదని నిషేధం విధించారు. కాగా ఈ వీడియో గత వారం నుంచి సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరినీ డిబార్‌ చేసినట్లు యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించడంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. వాళ్లు తీసుకున్న నిర్ణయం మంచిదేనని కొందరు హర్షిస్తే వాళ్లు ప్రేమించుకుంటే మీకేంటంటా? అంటూ మరికొందరు మండిపడుతున్నారు. 

చదవండి: మాస్క్‌ ధరించమన్నందుకు ఉబర్‌ డ్రైవర్‌పై మహిళ దాడి

వైరల్‌: ఆకలేస్తే అంతేమరీ! 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top