యాపిల్‌ పుట్టినిల్లు ఎక్కడో తెలుసా? ఆ పండ్లు చిన్నగా, చేదుగా ఉండేవా!

Kazakhstan Almaty, the ancestral home of apples - Sakshi

హాలిఫాక్స్‌: యాపిల్‌ పండును వర్ణించమంటే ఎలా వర్ణిస్తాం? ఎర్రగా, తియ్యగా, పెద్దగా ఉంటుంది అంటాం. కానీ నిజానికి పురాతన కాలంలో యాపిల్‌ ఇలా ఉండేది కాదట! చాలా చిన్నగా, చేదుగా ఉండేదని కెనడా పరిశోధకులు చెప్తున్నారు. వేలాది సంవత్సరాల కాలంలో రకరకాల పద్ధతుల ద్వారా ఇప్పుడున్న ఆకారం, రంగు, రుచికి తీసుకొచ్చారని తేల్చారు. యాపిల్‌ పుట్టినిల్లు ఇప్పటి కజకిస్తాన్‌లోని తియాన్‌షెన్‌ కొండలు.

ఆ దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మాటీ పేరు యాపిల్‌ నుంచే పుట్టింది. అల్మాటౌ అంటే కజక్‌ భాషలో యాపిల్‌ కొండ అని అర్థం. మానవులు గత 5,000 సంవత్సరాలుగా యాపిల్‌ను సాగు చేస్తున్నారు. పురాతన కాలంలో యాపిల్‌ విత్తనాలను సిల్క్‌ రూట్‌ గుండా ఆసియా అంతటికీ రవాణా చేశారు. తర్వాత ఇవి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ చేరాయి. అప్పట్లో యాపిల్స్‌ చాలా చిన్నవిగా, చేదుగా ఉండేవి. కజకిస్తాన్‌ కొండల్లో సహజంగా యాపిల్‌ చెట్లు పెరుగుతుంటాయి. వాటికి కాసే పండ్లు చిన్న, చేదుగా, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.

ఈ అటవీ జాతి యాపిల్స్‌తో పోలిస్తే మనుషులు సాగు చేసే పండ్లు 3.6 రెట్లు అధిక బరువు, 43 శాతం తక్కువ అమ్లత్వాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. చేదుకు కారణమయ్యే ఫినోలిక్‌ కాంపౌండ్‌ 68 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందువల్లే చేదు చాలావరకు తగ్గిపోయినట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో గత 200 ఏళ్లుగా యాపిల్స్‌లో కొత్త రకాలను సృష్టించడంలో వేగం పెరిగింది. ఎక్కువ కాలం నిలువ ఉండే పండ్లను సాగు చేస్తున్నారు. అందులో తీపి శాతాన్ని పెంచుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top