క్షిపణుల కుంభవృష్టి | Israel said it struck 40 sites in Iran, including weapons facilities | Sakshi
Sakshi News home page

క్షిపణుల కుంభవృష్టి

Jun 19 2025 4:58 AM | Updated on Jun 19 2025 4:58 AM

Israel said it struck 40 sites in Iran, including weapons facilities

ఇరాన్‌లోని 40 ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ ముప్పేట దాడి 

సెంట్రిఫ్యూజ్, ఆయుధాల ఉత్పత్తి కర్మాగారాలపై క్షిపణుల కుండపోత 

డ్రోన్ల దండుతో చెలరేగిపోయిన ఇజ్రాయెల్‌ 

ఇరాన్‌లో 585 దాటిన మరణాలు 

1,300 మందికి గాయాలు

దుబాయ్‌/టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌: ఇరాన్‌ సైనికసామర్థ్యం అణ్వస్త్రస్థాయికి చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులతో దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్‌ బుధవారం తన బాంబుల కుంభవృష్టిని కురిపించింది. ఇరాన్‌లోని 40 కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్‌లను తయారుచేసే కర్మాగారంపై భీకరస్థాయిలో మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్‌ సాయుధశక్తిని నిర్వీర్యం చేసేందుకు క్షిపణుల ఉత్పత్తి ఆయుధ ప్లాంట్‌లపైనా ఇజ్రాయెల్‌ వందల కొద్దీ డ్రోన్లను ఎక్కుపెట్టింది. 

ఇరాన్‌ అంతర్గత భద్రత శాఖ ప్రధాన కార్యాలయంపైనా యుద్ధవిమానాలు దాడులుచేశాయి. ప్రతిగా ఇరాన్‌ సైతం ఇజ్రాయెల్‌ భూభాగాలపై క్షిపణులను పేలుస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ పతాకస్థాయిలకు చేరుకుంటోంది. తమ ఆయుధ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా తన పశి్చమాసియా మిత్రదేశాల గడ్డపై వేలాది మంది సైనికులను మోహరించిందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి ఇస్మాయిల్‌ బాఘై ఆరోపించారు. టెహ్రాన్‌ సమీపంలోని హకీమియా ప్రాంతంలోని ఇరాన్‌ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌కు చెందిన అకాడమీపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. 

పశ్చిమ ఇరాన్‌లోని క్షిపణి నిల్వ కేంద్రాలపై, క్షిపణి లాంచర్లపై దాడులు చేసింది. టెహ్రాన్‌ నగరంపై తెల్లవారుజామునే తెగబడింది. ఐదు గంటలకే భారీ పేలుడు శబ్దం వినిపించింది. కెర్మాన్‌షా ప్రాంతంలోని బెల్‌ ఏహెచ్‌–1 సూపర్‌కోబ్రాస్‌ రకం దాడి హెలికాప్టర్లను కుప్పకూల్చామని ఇజ్రాయెల్‌ తెలిపింది. దాడుల కారణంగా మౌలికసదుపాయాలు దెబ్బతిని ఇరాన్‌లో ఇంటర్నెట్‌ సేవలు దాదాపు నిలిచిపోయాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటిదాకా 585 మంది ప్రాణాలు కోల్పోయారని, 1,300 మంది గాయపడ్డారని ‘ఇరాన్‌ హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌’ సంస్థ తెలిపింది. 

దీటుగా స్పందిస్తున్న ఇరాన్‌ 
ఇరాన్‌ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 24 మంది చనిపోయారు. బుధవారం తమవైపు దూసుకొచ్చిన 10 క్షిపణులను నేలకూల్చామని ఇజ్రాయెల్‌ పేర్కొంది. జవాదాబాద్‌లో అత్యాధునిక ఎఫ్‌–35 యుద్ధవిమానాన్ని ఇరాన్‌ సేనలు పేల్చేశాయి. దాదాపు రూ.140 కోట్ల విలువైన హెర్మెస్‌ డ్రోన్‌నూ నేలకూల్చాయి. అత్యంత శక్తివంతమైన ఫతాహ్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణిని ప్రయోగించామని ఇరాన్‌ ప్రకటించింది. అయితే తమదేశంలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 15,871 చోట్ల నిర్మాణాలు, దాదాపు 1,300 వాహనాలు, 1,633 ఆస్తులు నాశనమయ్యాయని ఇజ్రాయెల్‌ బుధవారం ఒప్పుకుంది. 

దాడుల నేపథ్యంలో ఇరాన్‌ కేబినెట్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ సారథ్యంలో అత్యవసరంగా భేటీ అయ్యింది. ఉపాధ్యక్షుడు మొహమ్మద్‌ రెజా తదితరులు తాజా పరిస్థితిని అధ్యక్షునికి వివరించారు. ఇరాన్‌పై దాడుల ఉధృతి కొనసాగినాసరే యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపబోమని, అణుశాస్త్రవేత్తలు నిరాటంకంగా పనిచేస్తున్నారని స్విట్జర్లాండ్‌లోని ఇరాన్‌ రాయబారి అలీ బహ్రెయినీ ప్రకటించారు. ‘‘ ఇన్నిరోజులూ కేవలం హెచ్చరికగా దాడులు చేశాం. ఇజ్రాయెల్‌ దాడులను అడ్డుకునేందుకే క్షిపణుల్ని ప్రయోగించాం. ఇకపై ఇజ్రాయెల్‌కు బుద్ధి్దచెప్పేలా దాడులను తీవ్రతరం చేస్తాం’’ అని ఇరాన్‌ ఆర్మీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ జనరల్‌ అబ్దుల్‌ రహీమ్‌ మౌసావీ ప్రకటించారు.

మా జోక్యం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు: ట్రంప్‌ ఇజ్రాయెల్‌కు తోడుగా కయ్యానికి కాలు దువ్వితే అమెరికా అంతుచూస్తామని ఖమేనీ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇరాన్‌ యుద్ధంలో నేను జోక్యం చేసుకోవచ్చు. చేసుకోకపోవచ్చు కూడా. నేనేం చేస్తానో ఎవరికీ తెలీదు. ఇరాన్‌ తన అణ్వాయుధ తయారీ కార్యక్రమానికి స్వస్తిపలికేందుకు ఇప్పుడు కూడా సమయమేం మించిపోలేదు. న్యూక్లియర్‌ ప్రోగ్రామ్‌ను కొనసాగిస్తూ ఇరాన్‌ నిప్పుతో చెలగాటమాడుతోంది. మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇరాన్‌ను అడ్డుకునేదాకా దేన్నీ ఆపబోం’’ అని ట్రంప్‌ అన్నారు. లొంగిపోబోమని ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘‘ లొంగిపోయే ఉద్దేశ్యం  లేదా?. అయితే సరే. గుడ్‌ లక్‌(శుభాశీస్సులు)’’ అని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌లో భయానక నిశ్శబ్దం  
ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసంకావడంతో ఎప్పుడు ఎటు నుంచి ఇజ్రాయెల్‌ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్‌ ప్రజల్లో కనిపించాయి. చాలా నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, ఆఫీస్‌లు, స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. సురక్షిత ప్రాంతాలకు నిత్యావసర సామగ్రితో వలసవెళ్లేవాళ్లు తప్పితే రోడ్లపై ఇంకెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెల్‌లో కాస్తంత భిన్నమైన వాతావరణం కని్పంచింది. ఇరాన్‌ను సుదూరంగా ఉన్న ఇజ్రాయెల్‌ పట్టణాల్లో పౌరసంచారాన్ని స్థానిక యంత్రాంగం అనుమతించింది. ‘‘ మా ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకోవడమే ఇరాన్‌పై విజయానికి ప్రబల నిదర్శనం’’ అని ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి ‘ఇజ్రాయెల్‌ కట్జ్‌’ అన్నారు. ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ లక్ష్యంగా నెరవేరేదాకా ఇరాన్‌తో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.

భారతీయుల తరలింపు కోసం ఆపరేషన్‌ సిందూ 
ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను ‘ఆపరేషన్‌ సిందూ’ పేరిట తీసుకొస్తామని భారతసర్కార్‌ బుధవారం ప్రకటించింది. టెహ్రాన్‌లోని కెషవార్జ్‌ వీధిలోని వసతిగృహంపై ఇజ్రాయెల్‌ దాడిలో కొందరు భారతీయ వైద్య విద్యార్థులు గాయపడ్డారన్న వార్తల నడుమ కేంద్రం ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. ఇరాన్‌లో దాదాపు 4,000 మంది భారతీయులు ఉంటున్నారు. వీరిలో సగం మంది వైద్యవిద్యార్థులే. ఇప్పటికే 110 మందిని ఉత్తర ఇరాన్‌ గుండా ఆర్మేనియా దేశంలోకి సురక్షితంగా తరలించారు. వీళ్లను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొస్తున్నారు. గురువారం ఉదయంకల్లా ఈ విమానం ఢిల్లీకి   చేరుకోనుంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement