ఫలిస్తున్న ఇజ్రాయెల్‌ ప్లాన్‌.. హమాస్‌కు ఊహించని షాక్‌! | Israel Retakes Gaza Strip Border Area - Sakshi
Sakshi News home page

ఫలిస్తున్న ఇజ్రాయెల్‌ ప్లాన్‌.. హమాస్‌కు ఊహించని షాక్‌!

Published Wed, Oct 11 2023 8:56 AM

Israel Retakes Gaza Strip Border Areas - Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ దాడులతో గాజా పట్టణం గజగజ వణుకుతోంది. గాజాపై ముప్పేట దాడి జరుగుతోంది. ఒకవైపు విద్యుత్‌, ఇంధనం ఆహారాన్ని నిలిపివేసిన ఇజ్రాయెల్‌.. మరోవైపు వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. యుద్ధం కారణంగా వేలాది మంది ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు గాజాపై హెచ్చరికలు లేకుండా దాడులు చేస్తే బందీలను చంపేస్తామని హమాస్‌ బెదిరిస్తోంది.

వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్‌ దాడులతో గాజా అల్లకల్లోలం అవుతోంది. ఐదోరోజు యుద్ధంలో భాగంగా గాజా సరిహద్దు ప్రాంతాలను హమాస్ గ్రూపు నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నామని, ఇరువైపులా వేలాది మంది మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది. గాజాలోని కిజాన్-అన్-నజ్జర్ పరిసరాల్లోని హమాస్ మిలిటరీ కమాండర్ మొహమ్మద్ దీఫ్ తండ్రి ఇంటిని లక్ష్యంగా చేసుకుని రాత్రిపూట వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ నివేదించింది. అంతే కాకుండా గాజా ప్రాంతంలోని అనేక ప్రదేశాలు, రహదారులను ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ సాధించింది. నిన్న సాయంత్రం కూడా ఇజ్రాయెల్ దాడులను వేగవంతం చేసినట్టు పేర్కొంది. ఇజ్రాయెల్‌లో దాదాపు 3000 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ఇక, ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేయడం వల్ల గాజా నగరంలో వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. గాజాలోని రెండు వందల మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్ ధ్రువీకరించింది. వీటిలో మిలిటెంట్లు ఆయుధాలు దాచిన ఓ ప్రార్థనా మందిరం, ఒక అపార్టుమెంట్ భవనం ఉన్నాయని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలను అధికారిక వైబ్‌సైట్‌లో ఉంచింది. 

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌ నుంచి కిడ్నాప్‌ చేసి గాజాకు తీసుకెళ్లిన వారికి ఏమైనా జరిగితే హమాస్‌ పరిస్థితి మరింత దిగజారుతుందని ఐడీఎఫ్‌ హెచ్చరించింది. హమాస్‌ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలను కలిసి సమాచారం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం అధికారులను పంపింది. దాదాపు వంద కుటుంబాల వద్దకు ఈ అధికారులు వెళ్లి వారి ఆత్మీయులు గాజాలో హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న విషయాన్ని వెల్లడించారు. కిడ్నాప్‌నకు గురైన వారి సంఖ్య వంద నుంచి 150 మధ్యలో ఉంటుందని భద్రతా దళాలు ఇప్పటికీ అనుమానిస్తున్నాయి. బందీలను హతమారిస్తే హమాస్‌ ఉనికి లేకుండా చేస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, పాలస్తీనా వాసులు వీలైనంత త్వరగా ఈజిప్టుకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సైన్యం సూచించింది. గాజాకు ఈజిప్టుకు నుంచి సాయం అందుతోంది. 2 టన్నుల ఔషధాలను పంపింది. 

ఇది కూడా చదవండి: బర్త్‌డే వేడుకల్లో బెలూన్స్‌ వాడుతున్నారా?.. ఇది తెలుసుకోండి..

Advertisement
Advertisement