ఇకపై ఇరాన్‌తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ తప్పులు చేస్తూనే ఉందని తెలిపారు. చర‍్చల పేరుతో ఇరాన్ తమ సమయాన్ని వృథా చేస్తోందని అన్నారు. ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసిందని చెప్పారు. దీంతో యుద్ధం మరింత భీకరంగా కొనసాగే ముప్పు ఉందని నిపుణులు భావిస్తున్నారు.
బుధవారం అంకారాలో జరిగిన నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ఈ వ‍్యాఖ్యలు చేశారు. ఇరానీయులను "అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్లు" అంటూ ట్రంప్ విమర్శించారు. గత రాత్రి ఇరాన్‌కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై అమెరికా దాడులు జరిపిందని చెప్పారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు నౌకలపై దాడి జరిగిన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఆ దాడిని ఇరాన్ సైన్యమే జరిపిందని అమెరికా ఆరోపించింది.
"వాళ్లు తమ సొంత ప్రజలకు హాని చేశారు. నిరసనల‍్లో పాల్గొన్న 54,000 మందిని చంపారు. గత రాత్రి ఇరాన్‌కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై మేము చాలా శక్తిమంతంగా దాడి చేశాం. వాళ్లలో ఏదో సమస్య ఉంది" ట‍్రంప్ అన్నారు.
ఈ ఘర్షణ లక్ష్యం ఇదే..
ఇరాన్‌ను "దుష్ట దేశం"గా పేర్కొన్న ట్రంప్.. ఈ ఘర్షణ లక్ష్యం ఇరాన్ అణు సామర్థ్యాన్ని లేకుండా చేయడమేనని, అమెరికా ఇరాన్‌ను "డి-న్యూక్" చేస్తుందని మరోసారి చెప్పారు.
"గత రాత్రి మేము ఇరాన్‌పై చాలా తీవ్రంగా దాడి చేశాం. మీరు దాడి చేసిన ప్రతిసారీ మేమూ దాడి చేస్తామని నేను వాళ్లకు చెప్పాను. వాళ్లు నీచంగా వ్యవహరిస్తారు. అందరి వెంట పడతారు. బహుశా నా వెంట కూడా పడవచ్చు. వాళ్లు మాకు నచ్చరు. నాకు వాళ్లు నచ్చరు. వాళ్లు దుష్టులు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని తొలగించడమే మా లక్ష్యం. మేము దాన్ని డి-న్యూక్ చేస్తాం" అని ట్రంప్ చెప్పారు.


