Indian Students: మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి.. ! | Indian Students in Iran Urge Evacuation | Sakshi
Sakshi News home page

Indian Students: In Iran: ‘సురక్షిత ప్రాంతాలకు తరలించండి’.. ఏది సురక్షితమో చెప్పలేం..!

Jun 14 2025 4:59 PM | Updated on Jun 14 2025 5:08 PM

Indian Students in Iran Urge Evacuation

ఇజ్రాయిల్‌ నిన్న(శుక్రవారం) చేసిన దాడుల తర్వాత ఇరాన్‌లో ఉంటున్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఒక్కసారిగా ఇజ్రాయిల్‌ విరుచుకుపడటంతో ఇరాన్‌లో భారీ నష్టమే వాటిల్లింది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు చేసింది.  

‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ ప్రారంభించిన తర్వాత ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భీకర దాడుల్లో ఇరాన్‌ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు. అయితే దీనికి ప్రతిగా ఇజ్రాయిల్‌పై ఈరోజు(శనివారం) ఇరాన్‌ మెరుపు దాడులు చేసింది. ఇరాన్‌ చేసిన క్షిపణి దాడులతో ఇజ్రాయిల్‌లో సైతం భారీ నష్టమే వాటిల్లినట్లే తెలుస్తోంది. 

ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రతరం కావడంతో  ఇరాన్‌లో ఉన్న భారత విద్యార్థులు వణికిపోతున్నారు. ఏ సమయంలో ఏ ముప్పు ముంచుకొస్తుందో అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ వేడుకుంటున్నారు.  అధికారులు మాత్రం ప్రస్తుతం ఇక్కడ అంతా బాగానే ఉందని, మీరంతా సురక్షితంగా ఉన్నారనే భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. 

అయినప్పటికీ భారత విద్యార్థులు మాత్రం ఈ దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నామని, తమకు  ఒకానొక సమయంలో భారీగా భూమి కంపించినట్లు అనిపించిందని, సురక్షిత ప్రాంతాలకు తరలించే యత్నం చేయాలని విన్నవిస్తున్నారు.  ఈ యుద్ధ సమయంలో ఏది సురక్షిత ప్రాంతమనేది కూడా ఆ యూనివర్శిటీ అధికారులు చెప్పలేకపోతున్నారు. తమకు ఫలానా ప్రాంతం సురక్షితమైనదనే సమాచారం ఏదీ లేదని, మీరు దయచేసి సంయమనం పాటించాలని అంటున్నారు. ‘ మనమంతా సేఫ్‌ ప్లేస్‌లో ఉన్నాం. దయచేసి మీరు కామ్‌గా ఉండండి’ అంటూ టెహ్రాన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(టీయూఎంఎస్‌) అధికారులు చెప్పినట్లు కశ్మీర్‌ నుంచి వెళ్లి అక్కడ ఎంబీబీఎస్‌ రెండో ఏడాది చదువుతున్న తబియా జహ్రా పేర్కొన్నారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి వెళ్లిన అలిషా రిజ్వీ మాట్లాడుతూ.. ‘ ప్రస్తుతం మా డేటాను అధికారులు సేకరిస్తున్నారు. మా ఈ మెయిల్‌ అడ్రస్‌, ఫోన్‌ నంబర్లు తీసుకుంటున్నారు. ఒకవేళ మమ్మల్ని తరలించే అవసరం ఏర్పడితే అందుకు ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నారు’ ని ఆమె పేర్కొన్నారు.   వీరిద్దరి 5.5 ఎంబీఎస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇరాన్‌లోని టెహ్రాన్‌కు 2023లో రాగా, ఇప్పటికి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇదే తరహాలో చాలామంది విద్యార్థులు ఇరాన్‌లోని ప్రస్తుత పరిస్థితుల నడుమ భయాందోళనలతో ఉన్నారు. 

ఇదిలా ఉంచితే, జమ్మూ కశ్మీర్‌ విద్యార్థి సంఘం.. భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కలిసింది. భారత స్టూడెంట్లు అక్కడ ప్రస్తుత భయానక పరిస్ధితుల్లో ఉన్నారని, వారికి పదేపదే యుద్ధ సైరన్లు వినిపించడంతో వారు బెంబేలెత్తిపోతున్నారని జై శంకర్‌కు సదరు అసోసియేషన్‌ పెద్దలు విజ్తిప్తి చేశారు. ఈ మేరకు భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇరాన్‌లో చదువుతున్న తమ పిల్లల కోసం తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని స్టూడెంట్‌ అసోసియేషన్‌ సభ్యులు పేర్కొన్నారు. 

మరొకవైపు ఇరాన్‌లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది. అయితే ఇప్పుడు తాము ఉన్న ప్రదేశంలో ఉండలేకపోతున్నామనే ఆందోళన భారత విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement