గుండె బద్ధలయ్యింది.. నమ్మలేకపోతున్నా: హర్నాజ్‌ సంధు

Harnaaz Sandhu Mourns Miss USA 2019 Cheslie Kryst Demise - Sakshi

రంగుల ప్రపంచంలో మరో ధృవతార నేలరాలింది. మిస్‌ యూఎస్‌ఏ 2019 విజేత చెస్లై క్రిస్ట్‌ హఠాన్మరణం.. ఫ్యాషన్‌ ప్రపంచంలో విషాదం నింపింది. బ్యూటీ క్వీన్‌గా మాత్రమే కాదు.. ఫ్యాషన్‌ బ్లాగర్‌గా, లాయర్‌, ఉద్యమకారిణిగా 30 ఏళ్ల చెస్లై క్రిస్ట్‌ పేరు సంపాదించుకున్నారు. 

ఆదివారం ఉదయం క్రిస్ట్‌ న్యూయార్క్‌లోని తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె హఠాన్మరణంతో షాక్‌ తిన్న మోడలింగ్‌ ప్రపంచం నివాళులర్పిస్తోంది.  భారతీయ మోడల్‌, మిస్‌ యూనివర్స్‌ 2021 హర్నాజ్‌ సంధుతో ఆమెతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుని భావోద్వేగానికి లోనైంది. ‘నువ్వు ఎంతో మందికి స్ఫూర్తి. నమ్మకలేకపోతున్నా. గుండెబద్ధలైంది. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ చెస్లై’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది హర్నాజ్‌. 

ఇదిలా ఉండగా.. న్యూయార్క్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 60 అంతస్థుల ఆ బిల్డింగ్‌లో 9వ ఫ్లోర్‌లో ఆమె నివాసం ఉంటోంది. ఆమెది ఆత్మహత్యేనా? కారణాలేంటన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.  1991లో మిచ్‌గాన్‌, జాక్సన్‌లో జన్మించిన క్రిస్ట్‌.. సౌత్‌ కరోలీనాలో పెరిగింది. యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కరోలీనా నుంచి గ్రాడ్యుయేషన్‌, వేక్‌ ఫారెస్ట్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి న్యాయ పట్టా తీసుకుంది. నార్త్‌ కరోలీనాలోనే సివిల్‌ లిటిగేటర్‌గా విధులు నిర్వహించి.. ఆపై వైట్‌కాలర్‌ గ్లామర్‌ పేరుతో ఫ్యాషన్‌ బ్లాగ్‌ను నిర్వహించారు. 2019లో మిస్‌ నార్త్‌ కరోలీనాగా, అదే ఏడాది మిస్‌ యూఎస్‌ఏ టైటిల్‌ను గెల్చుకుంది. పలు అంశాలపై కూడా ఆమె వ్యతిరేక గళం వినిపించి ఉద్యమకారిణిగానూ పేరు సంపాదించుకుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top