Guinness World Records: ఆ పిల్లి వయసు 26

Guinness World Records: World oldest 26 year old cat Flossie becomes Guinness World Records title - Sakshi

లండన్‌: ఆ పిల్లి వయసు 26. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న పిల్లి ఇది. ఇప్పడు గిన్నీస్‌ రికార్డుల్లోకి ఎక్కబోతోంది. ఫ్లాజీ అని పిలుచుకునే ఆ ఆడ పిల్లి లండన్‌లో ఉంది. దీని వయసు 26 సంవత్సరాలని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధికారులు నిర్ధారించి సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు.  ఈ పిల్లి వయసు మనుషులు 120 ఏళ్లతో సమానమని గిన్నిస్‌ అధికారులు చెప్పారు. సాధారణంగా పిల్లులు 12 నుంచి 18 ఏళ్లు మాత్రమే జీవించగలవు. కానీ ఫ్లాజీ 26 ఏళ్లు వచ్చినా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం లండన్‌లో పిల్లుల్ని సంరక్షించే కేంద్రంలో ఉంచారు.  విశేషం ఏమిటంటే ఈ 26 ఏళ్లలో ఫ్లాజీ యజమానులు ముగ్గురు మారారు. 1995 సంవత్సరంలో ఫ్లాజీ పుట్టింది.

అప్పుడు ఒక మహిళ ఆమెని పెంచుకుంది. ఫ్లాజీకి పదేళ్లు వచ్చేటప్పటికీ  ఆ మహిళ మరణించడంతో ఆమె చెల్లి ఈ పిల్లిని చూసుకుంది. 14 ఏళ్లు ఆమె ఇంట్లో ఉంది. ఆ తర్వాత ఆమె కూడా మరణించింది. ఆమె కుమారుడు మరో రెండేళ్లు చూసుకున్నాడు. ఆ తర్వాత  పిల్లుల సంరక్షణ కేంద్రానికి అప్పగించాడు. ప్రస్తుతం అత్యధిక వయసున్న పిల్లుల్ని చూసుకునే విక్కీ గ్రీన్‌ అనే సంరక్షకుడు ఫ్లాజీ బాగోగులు చూస్తున్నాడు.  ప్రస్తుతం ఆ పిల్లికి చెవులు వినిపించడం లేదట. చూపు మందగించింది. అయినప్పటికీ మనుషుల్ని చూస్తే అభిమానంతో మీదకి వస్తుందని విక్కీ చెప్పుకొచ్చాడు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top