కనుమరుగు కానున్న బిల్లింగ్స్‌గేట్ చేపల మార్కెట్, స్మిత్‌ఫీల్డ్ మాంసం మార్కెట్
లండన్: బ్రిటన్‌లోని లండన్‌లో దాదాపు వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న రెండు మాంసం దుకాణ వాణిజ్య సముదాయాలు చరిత్రలో కలిసిపోనున్నాయి. లండన్‌లో 11వ శతాబ్దంలో ఏర్పాటైన బిల్లింగ్స్‌గేట్ చేపల మార్కెట్, స్మిత్‌ఫీల్డ్ మాంసం మార్కెట్ అతి త్వరలో మూతపడనున్నాయి. ఇన్నాళ్లూ హోల్‌సేల్ మార్కెట్లుగా శాసించిన ఈ రెండు వాణిజ్య సముదాయాలు ఇకపై పూర్తిగా తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. ఇక్కడి దుకాణాలను సమీపంలోని డాగెన్‌హామ్‌కు తరలించాలని మొదట్లో భావించారు. అయితే విపరీతంగా పెరిగిన నిర్మాణ వ్యయం, ధరల కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నారు.
ఈ రెండు మార్కెట్లు ఇకపై ఎక్కడా తమ కార్యకలాపాలను కొనసాగించబోవు. ఇక్కడి దుకాణాల యజమానులకు తగు నష్టపరిహారం, వ్యాపార ప్రోత్సాహకాలను అందించనున్నారు. దీంతో హోల్‌సేల్ దుకాణదారులు ఇకపై ఎవరికి వారు వేర్వేరుగా వేర్వేరు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. సంబంధిత బిల్లును త్వరలో బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నట్లు లండన్ సిటీ కార్పొరేషన్ బుధవారం తెలిపింది. బిల్లింగ్స్‌గేట్, స్మిత్‌ఫీల్డ్‌లోని వ్యాపారులు ఇప్పటికిప్పుడు ఆయా వాణిజ్య సముదాయాలను ఖాళీచేయాల్సిన పనిలేదు. 2028 సంవత్సరందాకా వారికి గడువు ఇచ్చారు. ఆలోపు నెమ్మదిగా ఎవరిదారి వారు చూసుకోవాల్సి ఉంటుంది.
పాత రోమన్ గోడకు అవతల నిర్మించిన స్మిత్‌ఫీల్డ్‌లో ఆ కాలంలో గుర్రాలు, గొర్రెలు, పశువుల అమ్మకానికి వినియోగించేవారు. తరువాత పూలు, పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీతోపాటు చేపలు, మాంసం అమ్మకాలు మొదలయ్యాయి. వందల ఏళ్లుగా లండన్ నగర చరిత్రకు ఈ మార్కెట్లు సాక్షిగా నిలిచాయి. స్మిత్‌ఫీల్డ్ భవనాలు విక్టోరియన్ కాలం నాటివి. తర్వాత కొన్ని మార్పులు జరిగినా దాదాపు ఆకాలంనాటిలాగానే ఉన్నాయి. 1958లో ఒక పెద్ద అగ్నిప్రమాదానికి గురైనా చెక్కు చెదరలేదు.
స్మిత్‌ఫీల్డ్‌లో వ్యాపారం రాత్రి పదింటికి మొదలై ఉదయం ఆరింటికల్లా ముగుస్తుంది. బిల్లింగ్స్‌గేట్ 19వ శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద చేపల మార్కెట్‌గా పసిద్ధి చెందింది. శిథిలావస్థకు చేరడంతో మార్కెట్‌ను 1982లో డాక్‌లాండ్స్‌కు మార్చారు. ఇప్పుడు బిల్లింగ్స్‌గేట్ స్థలంలో 4,000 కొత్త గృహాలను నిర్మించే ప్రతిపాదన ఉంది. స్మిత్‌ఫీల్డ్ ఒక సాంస్కృతిక కేంద్రంగా మారనుంది. ఇక్కడే కొత్త లండన్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. పూర్వం స్మిత్‌ఫీల్డ్ ప్రాంతం మద్యపానం, రౌడీలతో హింసకు చిరునామాగా ఉండేది. ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత చార్లెస్ డికెన్స్ స్మిత్‌ఫీల్డ్‌ను అప్పట్లో ‘మురికి, బురద’కు కేంద్రస్థానంగా అభివర్ణించారు. ఆయన రాసిన ఒలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్ రచనల్లోనూ ఈ మార్కెట్ల ప్రస్తావన ఉంది.
Comments
Please login to add a commentAdd a comment