ట్విటర్‌ ట్విస్ట్‌: ట్వీట్‌తోనే భారీ షాక్‌ ఇచ్చిన ఎలన్‌ మస్క్‌.. పైసా వసూల్‌!

Elon Musk Says Twitter Charge Fee For Commercial Government Users - Sakshi

ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు. ట్విటర్‌ యూజర్లకు స్వేచ్ఛ విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండబోవంటూ ప్రకటిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ స్వేచ్ఛను కొన్ని వర్గాలకు ఉచితంగా అందించకూడదనే నిర్ణయానికి ఆయన వచ్చాడు. 

ట్విటర్‌ ఇప్పటివరకు ఫ్రీ సోషల్‌ మీడియా యాప్‌. అయితే.. రాబోయే రోజుల్లో మాత్రం కొంత డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికైతే కేవలం కమర్షియల్‌, ప్రభుత్వ అకౌంట్ల విషయంలో ఫీజు వసూలు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు ట్విటర్‌ కొత్త బాస్‌ ఎలన్‌ మస్క్‌.  ఈ ఫీజులు ఏమేర ఉంటాయనే విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. 

క్యాజువల్‌ యూజర్స్‌కి ట్విటర్‌ సేవలు ఉచితమే, బహుశా ప్రభుత్వ, కమర్షియల్‌ యూజర్ల విషయంలో స్వల్పంగా ఫీజు వసూలు చేయొచ్చు అంటూ నిర్ణయాన్ని చెప్పకనే చెబుతూ బుధవారం ఎలన్‌ మస్క్‌ ఒక ట్వీట్‌ ద్వారా ప్రకటించాడు. 

► ఇదిలా ఉండగా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో అధ్యక్షుడి దగ్గరి నుంచి స్థానిక నేతల దాకా.. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంబంధిత వ్యక్తులు.. ట్విటర్‌ ద్వారానే పోస్టులతో ప్రచారం చేస్తారనే విషయం తెలిసిందే. మరోపక్క కంపెనీలు సైతం తమ ప్రకటనలకు సోషల్‌ మీడియాలను వేదికగా చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఫీజులు స్వల్పంగానే ఉంటాయని ఎలన్‌ మస్క్‌ చెప్పినప్పటికీ.. ఇదంతా పైసా వసూల్‌ వ్యవహారమనే విషయం చెప్పకనే చెప్పినట్లయ్యింది. 

 ట్విటర్‌ కొనుగోలు విషయంలో హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. తాను ట్విటర్‌ కొనుగోలుకు ప్రయత్నించానంటూ మస్క్‌ చేసిన ట్వీట్‌తో మొదలై.. చివరకు వంద శాంతం వాటాను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసే దాకా డ్రామా నడిచింది. అయితే ట్విటర్‌ ఆఫీస్‌ నుంచి మేనేజ్‌మెంట్‌, వ్యవహారాలు ప్రతీ విషయంలో తాను సంతృప్తిగా లేనంటూ మస్క్‌ నేరుగా ట్విటర్‌ అధికార ప్రతినిధుల వద్దే ప్రస్తావించడం విశేషం. 

► ఈ నేపథ్యంలో ట్విటర్‌లో సమూల మార్పులు రానున్నట్లు ముందుగానే సంకేతాలు ఇచ్చాడు ఎలన్‌ మస్క్‌. ముందు ముందు ఇంకా ట్విటర్‌ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడో అనే ఆసక్తి మొదలైంది ఇప్పుడు. ఇంకోవైపు సీఈవో పరాగ్‌ అగర్వాల్‌తో పాటు లీగల్‌ హెడ్‌ విజయా గద్దెను సైతం తప్పించే అవకాశాలు లేకపోలేదంటూ ది న్యూయార్క్‌ పోస్ట్‌ఒక కథనం ప్రచురించింది.

► ఎలన్ మస్క్ ఇంతకు ముందే ట్విట్టర్ బ్లూ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సేవకు కొన్ని మార్పులను సూచించాడు. అందులో ధర తగ్గింపు ప్రస్తావన కూడా ఉంది. ఇక మొన్న సోమవారం న్యూయార్క్‌లోని వార్షిక మెట్ గాలాలో, ఎలాన్ మస్క్ పారదర్శకంగా పని చేస్తుంటాడు ప్రకటించాడు. మరో ఆరు నెలలో ట్విటర్‌ పూర్తిగా ఎలన్‌ మస్క్‌ చేతుల్లోకి వెళ్లనుంది.

చదవండి: మస్క్‌ బెదిరింపులకు భయపడం!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top