
ఆ పత్రిక తనను అవమానిస్తోందని మండిపాటు
వాషింగ్టన్: ‘ద న్యూయార్క్ టైమ్’ పత్రిక తనను అవమానించడమే పనిగా పెట్టుకుందని అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. అంతేకాకుండా విపక్ష డెమెక్రటిక్ పార్టీకి కరపత్రికగా మారిపోయిందని ఆరోపించారు. తనకు, తన కుటుంబానికి, వ్యాపారానికి వ్యతిరేకంగా తప్పుడు సేŠట్‌ట్‌మెంట్లు ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. ఆ పత్రికపై కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. తనకు జరిగిన నష్టానికి గాను ఆ పత్రిక 15 బిలియన్ డాలర్ల (రూ.1.32 లక్షల కోట్లు) పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఈ ఈ మేరకు సోమవారం రాత్రి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే, ట్రంప్ డిమాండ్ చేస్తున్న సొమ్ము ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక మార్కెట్ విలువ కంటే అధికం కావడం గమనార్హం. పాత్రికేయ రంగంలో ప్రమాణాలను పునరుద్ధరించడం, సమగ్రతను కాపాడడం తన ఉద్దేశమని ట్రంప్ చెబుతుండడం విశేషం. అయితే, నిపుణుల వాదన మరోలా ఉంది.
న్యూయార్క్ టైమ్స్‌పై పరువు నష్టం దావా వేయడం ద్వారా పత్రికా స్వేచ్ఛను హరించాలని, వ్యతిరేక గళాలను అణచివేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. ట్రంప్ వ్యవహార శైలిని తప్పుపడితే కోర్టుకు లాగడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ట్రంప్ వేసిన పరువు నష్టం దావాలో పుస్తక ప్రచురణ సంస్థ పెంర్విన్ రాండమ్ హౌస్‌తోపాటు న్యూయార్క్ టైమ్స్‌లో పనిచేసే నలుగురు జర్నలిస్టుల పేర్లు కూడా చేర్చారు. వీరిలో ఇద్దరు ట్రంప్‌పై ఒక పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని పెంర్విన్ ప్రచురించింది.
ఆ దావాలో పస లేదు
కోర్టులో ట్రంప్ దాఖలు చేసిన పరువునష్టం దావాపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక యాజమాన్యం స్పందించింది. ఆ దావాలో ఏమాత్రం పస లేదని, అది చెల్లదని, న్యాయ పరీక్షకు నిలవదని తేల్చిచెప్పింది. మీడియా స్వతంత్రను దెబ్బతీయడమే ట్రంప్ ఉద్దేశమని విమర్శించింది. ప్రసార మాధ్యమాలను అణచివేయడం మానుకోవాలని సూచించింది. ఇలాంటి చిల్లర బెదిరింపులకు తాము లొంగబోమని స్పష్టంచేసింది. నిజాలు నిర్భయంగా బహిర్గతం చేస్తూనే ఉంటామని, తమను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొంది. న్యాయం తమవైపే ఉందని ఉద్ఘాటించింది.