ఆవిష్కరణ: ప్లాస్టిక్‌ అవుతుంది వెనీలా ఫ్లేవర్‌!

Britain Scientists Creates Vanilla Flavour From Plastic - Sakshi

లండన్‌: మనిషికి ప్రియమైన శత్రువుగా పిలిచే ప్లాస్టిక్‌ సీసాలను వెనీలా ఫ్లేవర్‌గా రీసైకిల్‌ చేసేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు. బ్రిటన్‌లోని ఎడిన్‌బరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేసి.. ప్లాస్టిక్‌ చెత్తను కాస్తా ఉపయోగకరమైన పదార్థంగా మార్చేశారు. ఇందుకోసం వారు ఈ–కోలి బ్యాక్టీరియాలో కొన్ని మార్పులు చేశారు. ఇలా మార్పులు చేసిన బ్యాక్టీరియా ప్లాస్టిక్‌ చెత్తను జీర్ణం చేసుకుని వెనీలా ఫ్లేవర్‌ ముడి పదార్థమైన వనిల్లిన్‌గా మార్చేశాయి. బ్యాక్టీరియా సాయంతో ప్లాస్టిక్‌ చెత్తకు విరుగుడు కనిపెట్టేందుకు చాలాకాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రత్యేకంగా పెట్‌బాటిళ్లలోని టెరిఫ్తాలిక్‌ యాసిడ్‌ అనే పదార్థాన్ని నాశనం చేసేలా ఈ–కోలి బ్యాక్టీరియాలోఎడిన్‌బరో శాస్త్రవేత్తలు మార్పులు చేశారు. కొన్ని మార్పులు, చేర్పుల తర్వాత ఈ డిజైనర్‌ ఈ–కోలి బ్యాక్టీరియా అందించిన ప్లాస్టిక్‌లో 79 శాతాన్ని వనిల్లిన్‌గా మార్చేయగలిగాయి. సాధారణంగా వనిల్లిన్‌ను వనీలా గింజల నుంచి వేరు చేస్తారు. ఆహారంతో పాటు దీన్ని కీటకనాశినులు, ఫినాయిల్, ఫ్లోర్‌ క్లీనర్ల వంటి వాటి తయారీలోనూ వాడుతుంటారు. ప్లాస్టిక్‌ బాటిళ్ల నుంచే దీన్ని నేరుగా తయారు చేయగలిగితే ఏటా వేల టన్నుల వనిల్లిన్‌ ఉత్పత్తికి వనీలా గింజలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.

చిటికెలో నానో వజ్రాలు...
పెన్సిల్‌కు.. వజ్రాలకు మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంది. రెండూ కర్బనంతోనే తయారవుతాయి. అయితే అణువుల అమరికలో తేడా ఉంటుంది. ఈ తేడాల వల్లనే ఒకటి పెన్సిల్‌ (గ్రాఫైట్‌)గా మారిపోతే.. ఇంకోటి విలువైన వజ్రమవుతుంది. ఈ గ్రాఫైట్‌ పొరను అదేనండి.. గ్రాఫీన్‌ను చిటికెలో వజ్రాలుగా మార్చేసే కొత్త టెక్నిక్‌ ను అమెరికాలోని రైస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అదెలాగో తెలుసా కార్బన్‌కు కరెంట్‌ షాకిస్తే.. అది వజ్రంగా మారిపోతుంది. ఎంత మోతాదులో ఇవ్వాలి? ఎంత సమయం ఇవ్వాలన్న దానిపై వజ్రం తుదిరూపు ఆధారపడి ఉంటుంది.

ఫ్లాష్‌ జౌల్‌ హీటింగ్‌ అని పిలిచే ఈ కొత్త పద్ధతి గత ఏడాది జనవరిలోనే ప్రపంచానికి పరిచయమైంది. ఇందులో కార్బన్‌తో కూడిన పదార్థాన్ని 2,727 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలకు వేడి చేస్తారు. దాంతో కార్బన్‌ కాస్తా.. గ్రాఫీన్‌ పొరలుగా మారిపోతుంది. రైస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పద్ధతికి మరికొంత మెరుగుపరిచారు. పది మిల్లీ సెకన్ల స్థానంలో 10 నుంచి 500 మిల్లీ సెకన్ల వరకు వేడిచేస్తే.. కార్బన్‌ ఇతర రూపాల్లోకి అంటే నానోస్థాయి వజ్రాలుగా రూపాంతరం చెందుతాయని వీరు గుర్తించారు.

అంతేకాదు.. నానో వజ్రాల చుట్టూ కర్బన అణువుల కవచం ఉండే ‘కాన్‌సెంట్రిక్‌ కార్బన్‌’ను కూడా ఈ పద్ధతిలో తయారు చేయొచ్చని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జేమ్స్‌ టూర్‌ తెలిపారు. ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో ఉపయోగపడే ఫ్లోరిన్‌తో కూడిన నానో వజ్రాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకూ ఫ్లాష్‌ జౌల్‌ హీటింగ్‌ను వాడుకోవచ్చని వివరించారు. బోరాన్, ఫాస్ఫరస్, నైట్రోజన్‌ వంటి రసాయనాలతోనూ ఈ పద్ధతిని పరీక్షించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

మూలకణాలతో కండలు
వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని కండరాలు బలహీనపడటం సహజం. కొన్ని రకాల వ్యాధులున్నా.. మందుల వాడినా కూడా కండరాలు బలహీనపడిపోతుంటాయి. వ్యాయామం వంటి వాటితో ఈ నష్టాన్ని కొంతవరకు ఆలస్యం చేయవచ్చు. అయితే... శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగల శక్తి ఉన్న మూలకణాలతో ఈ సమస్యను అధిగమించవచ్చని గుర్తించారు అమెరికాలోని సాల్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు. గాయాల ద్వారా లేదా మరే ఇతర కారణాల వల్లనైనా బలహీనపడ్డ కండరాలను మళ్లీ పూర్వస్థితికి తీసుకెళ్లేందుకు మూలకణాలు ఉపయోగపడతాయని వీరు అంటున్నారు.

మూలకణ చికిత్సలపై జరుగుతున్న పరిశోధనల్లో భాగంగా యమనాక ఫ్యాక్టర్స్‌ అని పిలిచే కొన్ని ప్రొటీన్లపై చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సాధారణ కణాలను కూడా ఈ ప్రొటీన్లు మూలకణాలుగా మార్చగలవు. ఇలా చర్మకణాలను మూలకణాలుగా మార్చి.. వాటి ద్వారా కండర కణజాలాన్ని వృద్ధి చేసేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే ఇదంతా ఎలా జరుగుతుందో.. ఇప్పటికీ అస్పష్టమే. ఈ మిస్టరీని విప్పేందుకు సాల్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్త ఛావ్‌ వాంగ్‌ పరిశోధనలు చేసినప్పుడు కొన్ని కొత్త సంగతులు తెలిశాయి. యమనక ఫ్యాక్టర్‌ ప్రొటీన్లు బాసల్‌ లామినా అనే పొరలో ఉండే శాటిలైట్‌ కణాలపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది.

కండరాల పోగుల్లోకి యమనక ఫ్యాక్టర్లను చేర్చినప్పుడు ఈ కణాలు చైతన్యవంతమై కండరాల వృద్ధికి సంకేతాలు ఇస్తున్నట్లు స్పష్టమైంది. నిశిత పరిశీలన తరువాత తేలిందేమిటంటే.. ఈ యమనక ఫ్యాక్టర్లు డబ్ల్యూఎన్‌టీ4 పేరున్న ప్రొటీన్ల మోతాదును తగ్గిస్తున్నాయి అని. ఈ ప్రొటీన్‌ను అర్థం చేసుకోగలిగితే కండరాల పునరుజ్జీవానికి కొత్త మందులు తయారుచేయొచ్చని ఛావ్‌ వాంగ్‌ అంటున్నారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top