ట్రేడింగ్ పేరిట రూ.12 లక్షలు స్వాహా
కీసర: సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ పేరిట ఓ వ్యక్తి నుంచి రూ.12.94 లక్షలు దోచేశారు. కీసర పోలీసులు తెలిపిన మేరకు.. కీసర నాగారం సత్యనారాయణ కాలనీకి చెందిన మహేశ్వర్‌గౌడ్ ఫోన్‌నెంబరును సైబర నేరగాళ్లు రెండు వాట్సాప్ గ్రూప్స్‌లో చేర్చారు. నిరాలి సంఘీ, సుబ్రతా ముఖర్జీ పేరిట మాట్లాడారు. లాభాలు తెప్పిస్తామని..ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టాలని నమ్మించారు.వారి మాటలు నమ్మిన బాధితుడు మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు.ఆ తరువాత రూ.40 వేలు జమ చేశాడు. అనంతరం రూ.15 వేలు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. అది నమ్మిన మహేశ్వర్ గౌడ్ రూ.12.94 లక్షలు జమచేశాడు. ఆ తరువాత డ్రా చేసుకునేందుకు యత్నించగా మరింత డబ్బు జమచేయాలని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆన్‌లైన్ ఉద్యోగం పేరిట మోసం..
సనత్‌నగర్: బేగంపేటకు చెందిన మంగళారపు శ్రీకాంత్‌కు టెలిగ్రామ్‌లో ఓ మెసేజ్ రావడంతో క్లిక్ చేశాడు. ఆరుషి మల్హోత్రాగా పరిచయం చేసుకున్న ఓ మహిళ.. సన్‌టెక్ ఇండియా, క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలలో పెట్టుబడితే 20 నుంచి 40 శాతం లాభాలు వస్తాయంటూ నమ్మబలికింది. ఆ తర్వాత మరో ఇద్దరు కూడా శ్రీకాంత్‌ను సంప్రదించారు. ఆన్‌లైన్ ఉద్యోగం పేరిట చిన్న చిన్న టాస్క్‌లు చేయించారు. మొదట శ్రీకాంత్ ఖాతాలో రూ.4,265 జమ చేశారు. అనంతరం వీఐపీ టాస్క్‌లు, ట్విన్ మిషన్ల పేరిట ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కోరారు. మోసగాళ్లు ఇచ్చిన లింక్‌ల ద్వారా శ్రీకాంత్ 15 సార్లు రూ.3,82,626 డబ్బు చెల్లించాడు.అయితే కేవలం రూ.11,630 మాత్రమే తిరిగి వచ్చాయి. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
లింక్ క్లిక్ చేస్తే రూ.91వేలు మాయం
నాంపల్లి: శాంతినగర్‌కు చెందిన ఓ యువతి ఇటీవల బీటెక్‌ను పూర్తి చేసింది. ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో జాబ్ కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో సెర్చ్ చేస్తోంది.ఈ క్రమంలో చేస్తుండగా వచ్చిన ఓ లింకుపై క్లిక్ చేయగా ఆమె అకౌంట్‌లో నుండి రూ.91,500 మాయం అయ్యాయి. దీంతో నాంపల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది.
ఐటీకే ఉద్యోగికి రూ.2.60 లక్షలు టోకరా
ఉప్పల్: ఐటీ ఉద్యోగికి ఏపీకే ఫైల్ పంపిన సైబర్ నేరగాళ్లు రూ.2.60 లక్షలు అతని బ్యాంక్ అకౌంట్‌నుంచి స్వాహా చేశారు. ఉప్పల్ పోలీసులు తెలిపిన మేరకు.. సెవన్ హిల్స్ కాలనికి చెందిన సాయి కిరణ్‌కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి పంజాబ్ నేషనల్ బ్యాంకు క్రెడిట్ కార్డు విభాగం నుంచి మాట్లాడుతున్నామని చెప్పాడు. కొత్త క్రెడిట్ కార్డు కోసం వివరాలను ఇవ్వాలని కోరాడు. ఏపీకే ఫైల్ పంపి యాప్ ద్వారా వివరాలు పూర్తి చేయాల్సిందిగా కోరాడు. యాప్‌ను ఓపెన్ చేయగానే అనుమానం వచ్చి కాల్ కట్ చేసినా కూడా బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.2,60,000 ఫిర్యాదు దారునికి తెలియకుండానే ఓటీపీలు చెప్పకుండానే ఖాతా ఖాళీ చేశాడు. దీంతో బాధితుడు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసాడు.
నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ప్రతిరోజూ అవగాహనకార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులుపంపిన లింకులను ఓపెన్ చేసి.. తీరా డబ్బు పోయిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో నలుగురిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు.


