సాక్షి,సిటీబ్యూరో: జలమండలి దక్కించుకున్న మూడు పీఆర్‌ఎస్‌ఐ అవార్డులను సోమవారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డికి అందించారు. రాష్ట్రీయ స్థాయిలో బెస్ట్ బ్రోచర్, కార్పొరేట్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం, బెస్ట్ లేఅవుట్, డిజైన్ కేటగిరీలో పోస్టర్ కేటగిరీల్లో జలమండలి బహుమతులను గెలుచుకుంది. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ) ద్వారా అందుకున్న అవార్డులను ఎండీకి అందజేశారు. కార్యక్రమంలో సీజీఎంలు కిరణ్ కుమార్, రాజ శేఖర్, పీఆర్వో సుభాష్, గ్రౌండ్ వాటర్ ఎక్స్ పర్ట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
2న హైబిజ్ టీవీ మీడియా అవార్డులు
సాక్షి, సిటీబ్యూరో: మీడియా రంగంలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ప్రతిష్టాత్మక హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2026 (6వ ఎడిషన్)ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమం మే 2న హైదరాబాద్‌లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నామన్నారు.ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో, డిజిటల్ మీడియా విభాగాల్లో జర్నలిజం, అడ్వర్టైజ్‌మెంట్, సర్క్యులేషన్ వంటి కేటగిరీల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 50కి పైగా విభాగాల్లో పురస్కారాలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది నలుగురు ప్రముఖ జర్నలిస్టులకు లెజెండరీ పురస్కారాలు అందజేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఏప్రిల్ 26లోపు 8096974747 వాట్సాప్ నంబర్‌కు పంపించాలన్నారు. అలాగే జర్నలిస్టుల పిల్లలకు రూ.2.5లక్షల విలువైన స్కాలర్‌షిప్స్ అందజేస్తామన్నారు.
దక్షిణమధ్య రైల్వేకు పీఆర్‌ఎస్‌ఐ పురస్కారాలు
సాక్షి, సిటీబ్యూరో: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన పబ్లిక్ రిలేషన్స్ అవార్డ్స్ – 2026 కార్యక్రమంలో, దక్షిణ మధ్య రైల్వే పబ్లిక్ రిలేషన్స్ విభాగానికి పురస్కారాలు లభించాయి. ‘‘తెలంగాణ రైజింగ్ 2047: కమ్యూనికేషన్, ఇన్నోవేషన్,ఎంపవర్‌మెంట్’’ అనే థీమ్‌తో నిర్వహించిన 4వ తెలంగాణ పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డులను అందజేశారు. మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక పాల్గొన్నారు.


