
ఫ్లైఓవర్‌లు.. అండర్ పాస్‌లు
ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే దిశగా అడుగులు
బంజారాహిల్స్: నిత్యం వేలాది మంది ఐటీ కారిడార్‌కు మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం చేరుకోవాలంటే కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దాటాల్సిందే. గతంలో ఇక్కడ ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చేందుకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మల్టీలెవల్ ఫ్లైఓవర్లు నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించి నలుగురు మంత్రులతో శంకుస్థాపన కూడా చేయించింది. కానీ.. కేబీఆర్ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో పెద్ద ఎత్తున చెట్లు తొలగించాల్సిన అవసరం రావడంతో పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఆ తర్వాత సొరంగ మార్గం నిర్మిస్తామని కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ ప్రతిపాదనలు సైతం కార్యరూపం దాల్చలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ట్రాఫిక్ కష్టాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు మరో ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని కన్సల్టెన్సీలతో పాటు జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం అధికారులు పని చేస్తున్నారు. ఈసారి మల్టీలెవల్ ఫ్లైఓవర్లు కాకుండా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
సాఫీగా ముందుకు సాగేలా..
● ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఎక్కువ సేపు నిలుస్తున్నతరుణంలో అసలు వాహనాలు ఈ సిగ్నళ్ల వద్ద ఆగకుండా ఉండేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతి జంక్షన్ మీదుగా వాహనాలు వెళ్లేలా ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. మల్టీలెవల్ ఫ్లై ఓవర్లకు పెద్ద మొత్తంలో స్థల సేకరణ అవసరం అవుతుండగా ఈ ఫ్లై ఓవర్లకు మాత్రం తక్కువ స్థలంలోనే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. దీనికి తోడు గతంలో కేబీఆర్ పార్కు వాక్‌వే సగానికి పైగా రోడ్డు వెడల్పులో పోయే అవకాశం ఉండగా ఈ కొత్త ప్రతిపాదనలో అటువంటి ప్రమాదమేమీ ఉండదని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే స్థానికంగా ఉన్న పార్కుల విభాగం అధికారులతో ఎక్కడెక్కడ చెట్లు రోడ్డు వెడల్పులో పోతాయో గుర్తించి మార్కింగ్ చేయాల్సిందిగా సూచించారు.
● ఈ ప్రాజెక్ట్‌లో కేబీఆర్ పార్కుకు ఎటువంటి ముప్పు లేకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేబీఆర్ పార్కు ఎదురుగా ఉన్న రోడ్డులో ఉండే చెట్లతో పాటు సెంట్రల్ మీడియన్‌లోని చెట్లు పూర్తిగా పోయే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఇందుకు సంబందించిన మార్కింగ్‌లను వేశారు. ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఫ్లై ఓవర్ మరో వైపు అండర్‌పాస్ నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన డిజైన్లు కూడా ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.
ఫ్లై ఓవర్లు ఇలా...
బంజారాహిల్స్ రోడ్ నెం. 14 జనతా బార్ నుంచి జపనీస్ గార్డెన్ వరకు
జపనీస్ గార్డెన్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1లోని హెరిటేజ్ బిల్డింగ్ దాకా
సీవీఆర్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45..
కేబీఆర్ పార్కు మెయిన్ గేటు నుంచి రెయిన్‌బో ఆస్పత్రి వరకు
వీటితో పాటు గుర్తించిన కొన్ని చోట్ల అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.
కేబీఆర్ పార్కు రోడ్డులో అధికారుల సర్వే
జంక్షన్ల మీదుగా నిర్మించేలాప్రతిపాదనలు
అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక

ఫ్లైఓవర్‌లు.. అండర్ పాస్‌లు