హన్మకొండ: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బీజేపీ ప్రభుత్వం తన బాధ్యతలనుంచి తప్పించుకోలేదని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని మహాత్మాగాంధీ విగ్రహంనుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ఘనంగా ‘విజయ్ మార్చ్’ నిర్వహించారు. ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. ఈ విజయం విద్యార్థుల హక్కుల కోసం పోరాడిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి అంకితం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈవీ శ్రీనివాస్ రావు, బత్తిని శ్రీనివాస్‌రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పింగిలి వెంకట్రామ్‌రెడ్డి, పులి ప్రియాంక, గోదాదేవి, సాగరిక రావు, కరాబు రాజేశ్వర్‌రావు, యువజన, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి


