మామునూరు: వరంగల్ మామునూరు నాలుగో బెటాలియన్‌లో కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా సివిల్ పోలీసులకు 28 రోజులుగా కొనసాగుతున్న బేసిక్ ఫస్ట్ రెస్పాన్స్ విపత్తుల నిర్వహణ శిక్షణ కార్యక్రమం శనివారం సాయంత్రం ముగిసింది. ముఖ్య అతిథిగా శివప్రసాద్‌రెడ్డి హాజరై ప్రతిభ చూపిన శిక్షణార్థులకు సర్టిఫికెట్లు, ప్రశంసపత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 మంది శిక్షణార్థులకు మొదట మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ గురించి, ఈసెస్‌ఎస్‌ఆర్ (కాలేప్సెడ్ స్ట్రక్చర్ సెర్చ్ అండ్ రెస్క్యూ), రోప్ రెస్క్యూ, ఎడీఆర్సీ ఆక్వాటిక్ డిజాస్టర్ రెస్పాన్స్ కోర్సులను నిష్ణాతులైన సిబ్బందితో శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా డీఎస్పీ శ్రీనివాస్, ఏసీ రాజేందర్, ఆర్‌ఐలు విజయ్, రవి, సర్వర్, వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్, ఎన్డీఆర్‌ఎఫ్ ట్రైనింగ్ సిబ్బంది, శిక్షణార్థులు పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: హైదరాబాద్‌లోని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం ఉదయం 10–30గంటలకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాలలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ అధికారి బి.నిర్మల, ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ సంచాలకులు డాక్టర్ కె.జగన్‌మోహన్ తెలిపారు. అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. సకాలంలో పరీక్షకు హాజరుకావాలని కోరారు.
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శనివారం ఉదయం అమ్మవారిని ఏకాదశి తిథికి ఆది దేవతయైన ఘనా, నీల పతాకా క్రమంలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో నిత్యాహ్నిక పూజలు, చతుస్థానార్చనలు జరిపారు. స్నపన మూర్తిని కాళీకల్పకం ప్రకారం ఘనాదేవిగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో నీల పతాక మాతగా అలంకరించి చతుఃస్థానార్చన పూజలు, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. ఏకాదశి పర్వదినం కావడంతో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
హన్మకొండ అర్బన్: జిల్లా పరిషత్ సీఈఓ బి.శేషాద్రికి హనుమకొండ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ పోస్టులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్.రవి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వె లువడే వరకు బి.శేషాద్రి అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు)గా విధులు నిర్వహించనున్నారు.


