బీఆర్‌నగర్‌లో ఉద్రిక్తత
ఖిలా వరంగల్: పాతకక్ష నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితుడు ఏడాదిగా అదును కోసం వేసి చూసి అత్యంత కిరాతకంగా గొంతులో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఉర్సుగుట్ట సమీప కాలనీ బీఆర్ నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బీఆర్ నగర్‌కు చెందిన మాడ అనిల్ (23) అదే ప్రాంతానికి చెందిన లారీ క్లీనర్ గిరబోయిన మహేశ్ స్నేహితులు. వీరిద్దరు గతేడాది డిసెంబర్ 31న మద్యం సేవించిన తర్వాత ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో అనిల్.. మహేశ్‌ను కత్తితో పొడవగా తీవ్రగాయాలతో ఎంజీఎంలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నాడు. నాటి నుంచి అనిల్ హైదరాబాద్‌లో కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాడు మృతుడిపై మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు సైతం నమోదైనట్లు తెలుస్తోంది. ఎలాగైనా అనిల్‌ను చంపాలని ఏడాదిగా మహేశ్ ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో అనిల్ తమ కులదైవమైన బీరన్న బోనాలకు శుక్రవారం హైదరాబాద్ నుంచి బీఆర్‌నగర్‌కు చేరుకున్నాడు. ఈ విషయం మహేశ్ తెలుసుకున్నాడు. ఎలాగైనా చంపాలని మాటువేశాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో బీరన్న గుడికి బయలుదేరిన అనిల్‌ను మహేశ్ ఎదురెళ్లి ఆకస్మికంగా గొంతులో కత్తితో పొడిచాడు. వెంటనే అనిల్ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. దారుణ హత్యను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కళ్లముందే తమ కుమారుడు హత్యగురికావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడు మహేశ్ నేరుగా మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈహత్యలో ప్రధాన నిందితుడు మహేశ్‌కు రాజు అనే వ్యక్తి సహకరించినట్లు తెలుస్తోంది.
ఘటనాస్థలికి పోలీసులు..
సమాచారం అందుకున్న మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ కర్రె స్వామి ఘటనా స్థలికి చేరుకున్నారు. హత్యప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
అనిల్ హత్యతో బీఆర్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడి ఇంటిపై మృతుడి బంధువులు దాడి చేయకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనిల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాగా.. మహేశ్ బీఆర్‌ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ‘మా అబ్బాయి ఎవరికి అపకారం చేయలేదు. పాత గొడవను మళ్లీ లేపి చంపారు.. నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని మృతుడి తండ్రి కొమురయ్య కన్నీరుపెట్టుకున్నారు.
యువకుడి దారుణ హత్య
వరంగల్ నగరంలోని బీఆర్ నగర్‌లో ఘటన
పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు?


