దుగ్గొండి: మద్యం అనేక కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. మానవత్వాన్ని మంట కలుపుతోంది. రక్త సంబంధాలను సైతం మరిపిస్తోంది. దీనికి నిదర్శనమే ఈ ఘటన. మద్యం మత్తులో ఓ యువకుడు తన పెద్దనాన్నను కర్రతో కొట్టి గోర్లతో మెడను పిసికి హత్య చేశాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముస్కుల సాంబరెడ్డి(56), తిరుపతిరెడ్డి అన్నదమ్ములు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే చనిపోయారు. సాంబరెడ్డి మానసిక దివ్యాంగుడు కావడంతో పెళ్లి కాలేదు. తిరుపతిరెడ్డికి పెళ్లి అయి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం తిరుపతిరెడ్డి భార్య క్యానర్‌తో చనిపోయింది. దీంతో సాంబరెడ్డి ఆలనాపాలన తమ్ముడు తిరుపతిరెడ్డి చూస్తున్నాడు. తిరుపతిరెడ్డి మూడు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఇక అప్పటి నుంచి తిరుపతిరెడ్డి పెద్ద కుమారుడు రాజు.. పెద్దనాన్న వద్ద ఉంటూ అతడికి వండి పెడుతున్నాడు. చిన్నకుమారుడు తిరుమల్ వరంగల్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రాజుకు పెళ్లి కాలేదు. మద్యానికి బానిసగా మారాడు. శుక్రవారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజుకు పెద్ద నాన్న సాంబరెడ్డి దుస్తుల్లోనే మల విసర్జన చేసి కనిపించాడు. దీంతో కోపోద్రెకుడైన రాజు పెద్దనాన్నను అర్ధరాత్రి కర్రతో విపరీతంగా కొట్టాడు. మెడ బాగాన్ని చేతులతో పిసికి గోర్లతో రక్కాడు. దీంతో సాంబరెడ్డి తెల్లవారుజామున మృతి చెందాడు.
రైతుబీమా ప్రీమియం తీసుకున్న రాత్రే హత్య..
తిరుపతిరెడ్డికి వ్యవసాయ భూమి ఉండగా తన నామినీగా ఇద్దరు కుమారులను కాకుండా అన్న సాంబరెడ్డిని పెట్టుకున్నాడు. దీంతో తిరుపతిరెడ్డి మృతి అనంతరం రైతు బీమా కింద రూ. 5లక్షలు వచ్చాయి. శుక్రవారం గిర్నిబావిలోని ఏపీజీవీబీ బ్యాంకుకు సాంబరెడ్డి ఇద్దరు తమ్ముడి కుమారులతో కలిసి వెళ్లాడు. డబ్బులు తీసుకున్నారు. ఇంటికి వచ్చిన రాత్రే హత్య జరగడం చర్చనీయాంశంగా మారింది.
గొయ్యి తీసి పూడ్చడానికి ప్రయత్నం..
సాంబరెడ్డి మృతిచెందాడని తెలుసుకున్న రాజు.. మృతదేహాన్ని పూడ్చి పెట్టడానికి శనివారం తెల్లవారుజామున గుంత తీయడం ప్రారంభించాడు. దీంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు వారు వెళ్లి చూడగా సాంబరెడ్డి మృతి చెంది ఉన్నాడు. వెంటనే వా రు 100 నంబర్‌కు ఫోన్ చేశారు. దీంతో ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ సాయిరమణ, ఎస్సై రణధీర్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. మృతుడి చెల్లి చల్లా ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయిరమణ తెలిపారు. కాగా, రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే తాను కర్రతో పెద్దనాన్నను కొట్టానని, చనిపోతాడని అనుకోలేదని తెలిపినట్లు సమాచారం.
మద్యం మత్తులో పెద్దనాన్నను చంపిన యువకుడు
దుగ్గొండి మండలం నాచినపల్లిలో దారుణం


