● ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
● కేయూలో సింపోజియం
కేయూ క్యాంపస్: తెలంగాణలో ఓటర్ల తొలగింపు కుటిల యత్నాలు చెల్లవని, మరో వారంరోజులు ప్రజసంఘాలు, సామాజిక ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివారం పూలే ఆశయ సాధనసమితి (పాస్) ఆధ్వర్యంలో కేయూలోని దూరవిద్యాకేంద్రం జర్నలిజం విభాగంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–(సర్) పై నిర్వహించిన సింపోజియంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా సర్ ప్రక్రియను నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లోనే సర్ ప్రక్రియ మందకోడిగా సాగుతున్నదన్నారు. సర్ ఫారంలో సంక్లిష్టతలను తొలగించాలని తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ ఆచార్య కె.వెంకటనారాయణ అన్నారు. యువత పౌరసమాజం బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కాపాడుకునేలా కృషి చేయాలలని ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజారాం, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.ఉమామహేశ్వర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధ్యాపకుడు డాక్టర్ యాదగిరి, కేయూ మాజీ రిజిస్ట్రార్ సదానందం అన్నారు. సభకు కేయూ జర్నలిజం విభాగం అధిపతి డాక్టర్ సంగాని మల్లేశ్వర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పూలే ఆశయసాధన ిసమితి రాష్ట్ర కార్యదర్శి చందా మల్లయ్య, బాధ్యులు డాక్టర్ కూరపాటి రమేశ్, తాడూరు శాస్త్రి, గోడిశాల సత్యనారాయణ మెరుగుబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.


