● 4,5 తరగతుల్లో 28 మంది విద్యార్థులు
● డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 4, 5వ తరగతుల్లో ప్రవేశాల ప్రక్రియ శనివారం పూర్తయిందని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రతిభా ఎంపిక పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించగా, రెండో దఫాలో 28 మంది విద్యార్థులు స్కూల్‌లో చేరినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ చిన్న వయసు నుంచే ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసిందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు శాసీ్త్రయ విధానంలో క్రీడా శిక్షణ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్కూల్‌లో విద్యార్థులకు వసతి, పోషకాహారం, వైద్య సేవలు, విద్యా సౌకర్యాలు, క్రీడా సామగ్రి వంటి అన్ని వసతులను ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించి వారి ప్రతిభను మరింత మెరుగుపరచాలని డీవైఎస్‌ఓ ప్రశాంత్ సూచించారు.


