న్యూస్‌రీల్
కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు దశాబ్ద కాలంగా నత్తనడకన సాగుతున్నాయి. ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారాయి. 2017లో అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కాజీపేట రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి భూమి పూజ చేశారు. ఇప్పటికీ ఆ పనులు తుది దశకు చేరుకోలేదు. దీంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగున్నర దశాబ్దాల క్రితం అప్పటి ప్రజల అవసరాలకు తగినట్లుగా నిర్మించిన ఈబ్రిడ్జి ప్రస్తుతం నెర్రెలు బారింది. పెచ్చులు ఊడి పడుతున్నాయి. బ్రిడ్జి పనులు కొనసాగుతున్నట్లుగా కనిపించినప్పటికీ పురోగతి ఏమాత్రం కనిపించట్లేదని వాహనదారులు వాపోతున్నారు.
ఇటీవల స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధికారులతో కలిసి పనులు పరిశీలంచడంతో పాటు పురోగతిపై సమీక్షించినప్పటికీ పనుల్లో ఆశించిన పురోగతి కనిపించట్లేదు. నిధుల కొరత, పరిపాలనా జాప్యం, శాఖల మధ్య సమన్వయ లోపం వంటి కారణాలతో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఆలస్యమవుతున్నట్లుగా తెలుస్తోంది. నిత్యం బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ దృష్టి సారించి పనులు పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సమన్వయ లోపం..
తరచూ ట్రాఫిక్ జామ్
వాహనదారులకు ఇబ్బందులు


