ఆరంభంలోనే శిక్షణలా? | - | Sakshi
Sakshi News home page

ఆరంభంలోనే శిక్షణలా?

Jul 24 2026 1:57 AM | Updated on Jul 24 2026 1:57 AM

విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలలు జూన్‌ 15 నుంచి పునఃప్రారంభమై తరగతులు కొనసాగుతున్నాయి. మరోవైపు అడ్మిషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కొత్తగా చేరిన విద్యార్థులు కూడా పాఠశాలల్లో ఉంటారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగేది కూడా ఇప్పుడిప్పుడే. ఇలాంటి కీలక సమయంలో దాదాపు 20 రోజులకు పైగా విద్యాశాఖ, (ఎస్‌సీఈఆర్‌టీ) టీచర్లకు శిక్షణ ఇస్తోంది. ఫలితంగా బోధనపై ప్రతికూల ప్రభావం పడనుంది. సాధారణంగా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు వేసవిలోనే జరుగుతాయి. గతేడాది కూడా మే నెలలో నిర్వహించారు. ఇందుకు భిన్నంగా ఈసారి విద్యాప్రారంభ కీలక దశలో శిక్షణలు కూడా అవి కూడా ఆన్‌లైన్‌లో కాకుండా ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారు. ప్రతీ పాఠశాలలో విద్యార్థుల నమోదును గతేడాది కంటే పది శాతం పెంచాలనే లక్ష్యాన్ని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ నిర్దేశించారు. శిక్షణల కారణంగా ఉపాధ్యాయులు ప్రవేశాలపై దృష్టి సారించలేకపోతున్నారనే వాదనలున్నాయి. టీచర్లకు విడతల వారీగా శిక్షణలు కొనసాగుతున్నాయి.

ఈ నెలాఖరు వరకు శిక్షణ..

ఉపాధ్యాయులకు గతంలో శిక్షణ ఇచ్చిన అంశాలను కొద్దిపాటి మార్పులతో శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతీసారి చెప్పిందే చెబుతున్నారని ఆసక్తి పోతోందని శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయుల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. హనుమకొండ జిల్లాలోని యూపీఎస్‌, హైస్కూళ్ల స్కూల్‌ అసిస్టెంట్లకు కొద్దిరోజులుగా సబ్జెక్టుల వారీగా హనుమకొండ జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ హైస్కూళ్లు శిక్షణ కేంద్రాలుగా శిక్షణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లిష్‌, హిందీ, ఫిజికల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు ఒక్కక్కరికి మూడు రోజుల చొప్పున వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈనెల 20 నుంచి తెలుగు, బయోసైన్స్‌ రెండో బ్యాచ్‌లోని స్కూల్‌ అసిస్టెంట్లకు, మేథమెటిక్స్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు మొదటి బ్యాచ్‌ వారికి జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు.

సుమారు 1,050కి పైగానే..

హనుమకొండ జిల్లాలోని 14 మండలాల్లోని 50 శాతం మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ) మండల కేంద్రాల్లో ఈనెల 21 నుంచి 23 వరకు శిక్షణ తరగతులకు హాజరవనున్నారు. 1,014 మంది ఎస్జీటీల్లో మొదటి విడతలో 806 మందికి ఈనెల 21 నుంచి 23 వరకు శిక్షణలు జరుగుతాయి. ఈనెల 29 నుంచి 30 వరకు మిగతా టీచర్లకు శిక్షణ ఉంటుంది. కాగా, ప్రాథమిక పాఠశాలల్లో సింగిల్‌ టీచర్‌, లేదా ఇద్దరు టీచర్లు మాత్రమే ఉండే పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్య అందకపోవచ్చు.

శిక్షణ తరగతుల్లో ఉపాధ్యాయులు

కుంటుపడనున్న విద్యాబోధన!

ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement