వరంగల్ అర్బన్: ఈనెల 17న ‘ఒడిసి పట్టడంలో ఓటమి’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం స్పందించింది. వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్‌యూఏ) ఆధ్వర్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్‌యూఏ) అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడనున్న నేపథ్యంలో భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు తవ్వించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకన్న, అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్‌ఈ రాజ్‌కుమార్, మెప్మా పీడీ రాజేశ్వర్, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, ఈఈలు మహేందర్, సంతోష్‌బాబు, మాధవీలత, ఏఐయూఏ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
మహా నగర ప్రజల వ్యక్తిగత, ఆరోగ్య పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పారిశుద్ధ్య, ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న సూచించారు. గురువారం ఖాజీపేట సర్కిల్‌లోని 59వ మోడల్ డివిజన్‌లో అమలు చేస్తున్న పారిశుద్ధ్య విధానాలపై కమిషనర్, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అనంతరం స్థానిక కూరగాయల మార్కెట్‌ను పరిశీలించి ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న ఒక వ్యాపారికి రూ.2,000, రోడ్డుపై నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు వేసిన ఇంటి యాజ మానికి రూ.5 వేలు జరిమానా విధించారు. తని ఖీల్లో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, శానిటరీ సూపర్‌వైజర్లు గోల్కొండ శ్రీను, నరేందర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటేషన్, మలేరియా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పన్ను వసూళ్లు వేగిరం చేయండి
ఆస్తి, నీటి, గార్బేజీ పన్నుల వసూళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. గురువారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్, ఉప కమిషనర్లతో కలిసి ట్యాక్సేషన్ అధికారులు, రెవెన్యూ సిబ్బందితో పన్ను వసూళ్ల పురోగతిపై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నారాణి, బిర్రు శ్రీను, సమ్మయ్య, ట్యాక్సేషన్ అధికారి రామకృష్ణ, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు పాల్గొన్నారు.


