హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ ఆవరణ కంపుకొడుతోంది. సిటీ బస్ స్టేషన్‌లో హైదరాబాద్ రూట్ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలిపే ప్లాట్ ఫాం–1, ప్లాట్ ఫాం–2 ప్రాంతంలో ఇటీవలి వర్షాలకు మురుగు నీరు నిలిచింది. చిన్నపాటి వర్షం కురిసినా బస్ స్టేషన్‌లోకి నీరు చేరుతోంది. ఏళ్లుగా ఈ సమస్య ఇలాగే ఉంటున్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం శాశ్వత పరిష్కారం చూపట్లేదనే విమర్శలున్నాయి. సిటీ బస్‌స్టేషన్‌లోని ప్లాట్ ఫాం–1, ప్లాట్ ఫాం–2లో మురుగు నీరు నిల్వ ఉండి బస్సులు నిలిపే పరిస్థితి లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
వృద్ధి చెందుతున్న ఈగలు, దోమలు
సిటీ బస్ స్టేషన్ ప్లాట్ ఫాంల సమీపంలో మురుగు నీరు నిలిచి దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం అక్కడే పై అంతస్తులో ఉన్నప్పటికీ అధికారులు తమకేమీ పట్టదనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఎం, డిప్యూటీ ఆర్‌ఎంలు, ఇతర అధికారులకు సమస్య కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బస్సులు ఎక్కి, దిగే క్రమంలో నీటి నిల్వ కారణంగా ప్రయాణికులు జారి కింద పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని వారు కోరుతున్నారు.
● మురుగు నీటితో ప్రయాణికుల అవస్థలు
● శాశ్వత పరిష్కారం చూపడంలో ఆర్టీసీ విఫలం!


