కాజీపేట అర్బన్: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతీమహిళకు నెలకు రూ.2,500 అందజేసి లక్షాధికారులను చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కాజీపేట మండలం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌హాల్‌లో గురువారం పోచంపల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి 6,200 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందజేసి మాట్లాడారు. పుట్టినరోజు ఆర్భాటంగా చేసుకుని వృథాగా డబ్బులు ఖర్చు చేయడం కంటే ఆత్మీయతతో ఓ చిరునవ్వు అందిస్తే చాలు అన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట కుట్టు మిషన్లు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు కుట్టుమిషన్లను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని రవీందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, సతీశ్‌బాబు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


