పీవీ విజ్ఞాన కేంద్ర పనులు
భీమదేవరపల్లి : పీవీ విజ్ఞాన కేంద్ర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని కస్తూర్బా విద్యాలయాన్ని తనిఖీ చేయడంతోపాటు వంగర గ్రామంలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్వగ్రామం వంగరలో నిర్మిస్తున్న ‘పీవీ విజ్ఞాన కేంద్రం’ పనులను తనిఖీ చేశారు. నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియం, విద్యుత్ దీపాలు, తాగునీటి సౌకర్యాలు, ప్రాంగణంలోని మొక్కల నిర్వహణను పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్ గజ్జెల సృజనరమేశ్, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, డీఈ రఘు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, ఎస్‌ఓ జ్యోతి పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్
చాహత్ బాజ్‌పాయ్


