యూడైస్‌ ప్రకారమే యూనిఫామ్‌ | - | Sakshi
Sakshi News home page

యూడైస్‌ ప్రకారమే యూనిఫామ్‌

Jul 20 2026 1:32 AM | Updated on Jul 20 2026 1:32 AM

హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ

పాఠశాలల విద్యార్థులకు క్లాత్‌ రాక

పూర్తి కావొస్తున్న స్టిచ్చింగ్‌ ప్రక్రియ

ఈసారి డిజైన్‌, కలర్‌ మార్చిన ప్రభుత్వం

విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభించి 35 రోజులు అవుతోంది. ప్రతీ ఏడాది పాఠశాలలు తెరిచిన జూన్‌ 12వ తేదీనే ఒక్కో విద్యార్థికి ఒక్కోజత స్కూల్‌ యూనిఫామ్‌, ఆతర్వాత మరో జత అందించేవారు. ఈ విద్యాసంవత్సరంలో స్కూల్‌ యూనిఫామ్‌ క్లాత్‌ పంపిణీని ప్రభుత్వం ఓ సంస్థకు అప్పగించింది. డిజైన్‌, రంగులు మార్పు చేశారు. రెండు మూడు రోజులుగా హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మోడల్‌ స్కూల్స్‌ విద్యార్థులకు అందించే స్కూల్‌ యూనిఫామ్‌ క్లాత్‌ 14 మండల కేంద్రాలకు చేరుకుంది. అయితే, పలుచోట్ల సరిపడా క్లాత్‌ రాలేదని, ఇంకా కొంత క్లాత్‌ రావాల్సి ఉందని తెలుస్తోంది. సరిపడా రాకపోతే కొంతమంది విద్యార్థులకు తక్కువ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఈసారి యూడైస్‌లో నమోదైన వివరాల ఆధారంగా యూనిఫామ్‌ అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులకు అప్పగింత

జిల్లాలోని మండల కేంద్రాలకు స్కూల్‌ యూనిఫామ్‌ క్లాత్‌ వచ్చింది. ఈ క్లాత్‌ను ఆయా మండలాల స్కూళ్ల పరిధి మహిళా సంఘాలకు (సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపుల)కు స్టిచ్చింగ్‌ కోసం అప్పగించారు. ఇప్పటికే ఆయా విద్యార్థుల కొలతలను కూడా సేకరించారు. స్టిచ్చింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పట్టణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ పరిధిలోని మెప్మా ఆధర్వంలో మహిళా సంఘాల ద్వారా స్టిచ్చింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

కేజీబీవీ విద్యార్థినులకు త్వరలో..

జిల్లాలోని 9 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినుల కోసం యూనిఫామ్‌ క్లాత్‌ కొద్దిరోజుల క్రితమే వచ్చింది. ఆయా విద్యార్థినుల కోసం రెండుజతల స్కూల్‌ యూనిఫాం స్టిచ్చింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. కొద్దిరోజుల్లోనే ఆయా విద్యార్థినులకు స్కూల్‌ యూనిఫామ్‌ అందించనున్నారు. ఒక్కోజతకు స్టిచ్చింగ్‌ చార్జి రూ.75 ఇవ్వనున్నారు.

యూనిఫామ్‌ క్లాత్‌ తక్కువపడే అవకాశం..

యూడైస్‌ ప్రకారమే ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలోని విద్యార్థులకు రెండుజతల చొప్పున స్కూల్‌ యూనిఫామ్‌ అందించనున్నారు. అయితే ఈసారి క్లాత్‌ రావడం ఆలస్యమైంది. మరోవైపు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మండలాల్లోని వివిధ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇప్పటివరకు ఉన్నదాన్ని పరిగణనలోనికి తీసుకోవడం లేదు. గత యూడైస్‌ విద్యార్థుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకొని క్లాత్‌ను ఆయా మండలాలకు పంపిస్తున్నారు. దీంతో పలు మండలాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగవచ్చు, మరికొన్నింటిలో తగ్గవచ్చు. ప్రస్తుతం ఉన్న సంఖ్యను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల కొందరి విద్యార్థులకు స్కూల్‌ యూనిఫామ్‌ క్లాత్‌ తక్కువపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు గత యూడైస్‌కు అనుగుణంగా కూడా వివిద మండలాల్లో క్లాత్‌ సరిపడా రాలేదని తెలు స్తో ంది. జూలైలో ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణ లోనికి తీసుకొని క్లాత్‌ను పంపిణీ చేస్తే విద్యార్థులందరికీ రెండు జతల స్కూల్‌యూనిఫామ్‌ అందే అవకాశం ఉంటుంది. ఆదిశగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ విద్యాసంవత్సరం 29,157 మంది..

ఈ విద్యాసంవత్సరం హనుమకొండ జిల్లాలోని ఆయా పాఠశాలల్లో ఇప్పటివరకు 29,157మంది విద్యార్థులు 1 నుంచి 12వ తరగతివరకు చదువుతున్నారు. ఒక్కో మండలంలో ఒక్కో విధంగా విద్యార్థుల సంఖ్య ఉంటుంది. గత యూడైస్‌ ప్రకారం క్లాత్‌ వస్తుండడంతో పలుచోట్ల తక్కువపడే పరిస్థితి నెలకొని ఉంది. గత విద్యాసంవత్సరంలో ప్రారంభించిన 40కిపైగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రీపైౖమరీ తరగతుల విద్యార్థులకు స్కూల్‌ యూనిఫామ్‌ వచ్చింది. కానీ, ఈవిద్యాసంవత్సరం జిల్లాలోని 39 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించారు. వీటిలో చదువుతున్న విద్యార్థులకు క్లాత్‌ రాలేదని తెలుస్తోంది.

గత విద్యాసంవత్సరం 30,996 మంది విద్యార్థులు..

గత విద్యాసంవత్సరం యూడైస్‌ ప్రకారం హనుమకొండ జిల్లాలోని 483 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 30,996 మంది విద్యార్థులకు స్కూల్‌ యూనిఫామ్‌ అందజేయాల్సి ఉంటుంది. అందులో బాలురు 15,117, బాలికలు 15,879 మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement