పరిష్కారమా.. పరిహాసమా? | - | Sakshi
Sakshi News home page

పరిష్కారమా.. పరిహాసమా?

Jul 20 2026 1:32 AM | Updated on Jul 20 2026 1:32 AM

పెండింగ్‌లో వందలాది గ్రీవెన్స్‌ అర్జీలు

ఫిర్యాదుదారుల సహనానికి పరీక్ష

జీడబ్ల్యూఎంసీ అధికారుల అలసత్వం

వరంగల్‌ అర్బన్‌: ‘గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌లో వినతులకు పరిష్కారం దొరకట్లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బల్దియా అధికారులు పట్టించుకోవట్లేదు. క్షేత్రస్థాయిలో సమస్యలతో.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులతో విసిగివేసారి పోయాం’ అంటూ నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ మహా నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లో ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేస్తారు. ఒక వ్యక్తి దరఖాస్తు సమర్పించేందుకు దూరం ఆధారంగా సరాసరి అవుతున్న ఖర్చు అక్షరాలా రూ.50 నుంచి రూ.150. నడవలేని వారు కొందరైతే, కదల్లేని వారు ఇంకొందరు. ఇలా అనేక రకాల సమస్యలతో గ్రీవెన్స్‌కు వస్తారు. తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తారు. కానీ, వారిలో చాలామందికి నిరాశే మిగులుతోంది. కాగా, ఏ సమస్య అయినా నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని గ్రేటర్‌ అధికారులు గ్రీవెన్స్‌లో అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని అర్జీదారులు వాపోతున్నారు. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు సైతం తమకేం పట్టదు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఫిర్యాదుదారులకు సమస్యలు సవాల్‌గా మారుతున్నాయి.

అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి!

నల్లా కనెక్షన్‌ నుంచి డ్రెయినేజీలు, రోడ్లు, చెత్త సమస్య, అక్రమ నిర్మాణాలు, దోమలు, కోతులు, కుక్కలు, ట్రేడ్‌ లైసెన్స్‌, కొత్త ఇంటి నంబర్లు, సమాచార హక్కు చట్టం ఇలా సమస్య ఏదైనా నిర్ణీత గడువులోగా పరిష్కారం కావట్లేదు. అన్ని విభాగాల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు.

అండర్‌ ప్రాసెస్‌ పేరుతో కాలయాపన..

సమస్యలను పరిష్కరించినట్లు నమోదు చేస్తున్న దరఖాస్తుల్లో చాలా వరకు పరిష్కరించలేదని తెలుస్తోంది. కానీ, వాటిని పరిష్కరించినట్లు చూపెడుతున్నారు. మరికొన్నింటిని అండర్‌ ప్రాసెస్‌ అంటూ పక్కన పెడుతున్నారు. దీంతో ఉన్నతాధికారులు కూడా పెద్దగా దృష్టి కేంద్రీకరించడం లేదన్నది అర్థమవుతోంది. పదేపదే వినతులు అందజేస్తున్నా.. సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదనని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం కరువవుతోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలనేది?

ఇది వరకు ప్రజల నుంచి వచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, వింగ్‌ అధికారులు పరిశీలించేవారు. క్షేత్రస్థాయిలో గత కొద్ది నెలలుగా పరిశీలన కరువైంది. ఉద్యోగులు సమస్య పరిష్కరిస్తున్నారా? లేక పరిష్కరించకుండానే రికార్డుల్లో చూపిస్తున్నారా? అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రీవెన్స్‌కు మానిటరింగ్‌ సిస్టం (జీఎంఎస్‌) లేదు. దీంతో అధికారుల నడుమ సమన్వయం లోపిస్తోంది. ఈ–పరిష్కారం లేకపోవడం వల్ల గ్రీవెన్స్‌పై ప్రజల్లో అపనమ్మకం పెరిగే అవకాశం ఉంది. మహానగర పాలకసంస్థ కమిషనర్‌ దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై గ్రేటర్‌ అదనపు కమిషనర్‌ ఇసంపల్లి జోనాను వివరణ కోరగా సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం... క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రీవెన్స్‌ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం అని పేర్కొన్నారు.

పెండింగ్‌ దరఖాస్తులు ఇలా..

నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌

వరంగల్‌ మహానగర పాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వంగా వినతులు స్వీకరించనున్నట్లు వారు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

(ఈ ఏడాది జనవరి 1 నుంచి)

పరిధి దరఖాస్తులు తిరస్కరణ పరిష్కారం పెండింగ్‌

కాజీపేట సర్కిల్‌ కార్యాలయం 1,520 2 551 969

కాశిబుగ్గ సర్కిల్‌ కార్యాలయం 960 1 230 729

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement