హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం అమ్మవారిని విరోధిని, వహ్నివాసినిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీ క్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని విరోధిని క్రమంలో, షోడశీ క్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని వహ్నివాసిని క్రమంలో అలంకరించి విశేష పూజలు చేశారు. మహిళలు హాజరై అమ్మవారికి చీర, సారె సమర్పించారు. సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నేడు హెచ్‌ఎంలకు ఓరియంటేషన్
విద్యారణ్యపురి: హైదరాబాద్‌లోని కొమురంభీమ్ ఆదివాసీ భవన్‌లో పీఎం శ్రీ స్కూల్స్ హెచ్‌ఎంలు, జిల్లాస్థాయి అధికారులు, ఎఫ్‌ఏఓ, ప్లానింగ్ కోఆర్డినేటర్, జీసీడీఓ, సిస్టం అనలిస్టులకు సోమవారం ఓరియంటేషన్ కార్యక్రమం ఉంటుందని హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఓరియెంటేషన్‌కు జిల్లాలోని 19 పీఎం శ్రీస్కూల్స్ హెచ్‌ఎంలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, జాతీయ విద్యావిధానం, పీఎంశ్రీ పాఠశాలల అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, సమర్థంగా డిజిటల్ వ్యవస్థ వినియోగం, పాఠశాలల పనితీరుపై శిక్షణలో అవగాహన కల్పిస్తారని డీఈఓ తెలిపారు.
‘సర్’ ప్రక్రియ పరిశీలన
కాశిబుగ్గ: కాశిబుగ్గ తిలక్ రోడ్డులో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్ ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫారాలను సకాలంలో అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, తహసీల్దార్ శ్రీకాంత్, స్థానిక నాయకులు లక్కిరెడ్డి పూర్ణేందర్‌రెడ్డి, బొట్ల సదానందం, దాసరి రాజేశ్, శ్రీధర్‌రెడ్డి, రాజు, బీఎల్‌ఓలు విమల, యశోద, భాగ్యలక్ష్మి, శోభారాణి, రజిత తదితరులు పాల్గొన్నారు.
టీచర్ల సర్దుబాటు పారదర్శకంగా చేపట్టాలి..
కాళోజీ సెంటర్: జిల్లాలోని పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే ప్రక్రియ పారదర్శకంగా చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ప్రతినిధి బృందం సభ్యులు కోరారు. ఆదివారం ఆర్జేడీ కార్యాలయంలో డీఈఓ రంగయ్యనాయుడును కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జరిగిన అక్రమ సర్దుబాట్లను రద్దు చేసి అదనంగా ఉన్న ఉపాధ్యాయులను మొదటిగా కాంప్లెక్స్ పరిధి, ఆ తర్వాత మండల పరిధిలో సర్దుబాటు చేయాలన్నారు.
ఘనంగా సౌరవృత్త తారావళి పుస్తకావిష్కరణ
హన్మకొండ కల్చరల్: సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో అజో విభో కంధాళం ఫౌండేషన్ అధ్యక్షుడు అప్పాజోస్యుల సత్యనారాయణ రచించిన సౌర వృత్త తారావళి, వ్యాఖ్య పుస్తకాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో సహృదయ సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీ వేత్త, కవి విహారి, విశిష్ట అతిథులుగా తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి అనుమాండ్ల భూమయ్య, రచయిత, వ్యాఖ్యాత ఆచార్య తాడేపల్లి పతంజలి, సాహితీవేత్త డాక్టర్ దహగం సాంబమూర్తి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర సాహితీ అవార్డు గ్రహిత డాక్టర్ అంపశయ్య నవీన్, కవి రామచంద్రమౌళి, వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వనం లక్ష్మీకాంతారావు, మల్యాల మనోహరరావు, కళా రాజేశ్వర్, డాక్టర్ టి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


