జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
వరంగల్ అర్బన్: ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాకతీయ థియేటర్, పాపయ్యపేట చమన్, బట్టల బజార్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, జ్యోతి కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పారిశుద్ధ్యంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బట్టల బజార్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన (కన్‌స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్) వ్యర్థాలను గుర్తించి తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య జవాన్లు నిర్వహిస్తున్న హాజరు, విధుల రిజిస్టర్‌ను పరిశీలించారు. తనిఖీల్లో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, డీఈ రంగారావు, శానిటరీ సూపర్‌వైజర్ గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్‌ఎస్‌టీపీ సమర్థ నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి
నగరంలోని సెప్టిక్ ట్యాంకులనుంచి సేకరించే ఫీకల్ స్లడ్జ్‌ను తప్పనిసరిగా ‘ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్’ (ఎఫ్‌ఎస్‌టీపీ)లకే తరలించాలని, నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడైన పారబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ టి.వెంకన్న హెచ్చరించారు. శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో 15,150 కేఎల్‌డీ ఎఫ్‌ఎస్‌టీపీల నిర్వహణ ఏజెన్సీ ప్రతినిధులు, డీ–స్లడ్జింగ్ ఆపరేటర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఇందులో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్‌వో డాక్టర్ రాజేష్, హస్కీ సంస్థ ప్రతినిధి డాక్టర్ జనార్దన్ మోహన్, డీ–స్లడ్జింగ్ ఆపరేటర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: క్రీడా అకాడమీలు, ప్రాంతీయ క్రీడా వసతి గృహాల్లో (2026–27) విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27, 28 తేదీల్లో హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లోని హ్యాండ్ బాల్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, రెజ్లింగ్ అకాడమీల్లో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 97046 69637 మొబైల్ నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.


