హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు శనివారం నాలుగో రోజుకు చేరాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కురుకుల్లాక్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని భేరుండా క్రమంలో అలంకరించి నవరాత్ర విశేషపూజలు నిర్వహించారు. సాయంత్రం కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి హరిచందన, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ అమ్మవారిని దర్శించుకున్నారు.
హన్మకొండ: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈనెల 22న హనుమకొండ, వరంగల్ జిల్లాల పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. హనుమకొండ వాజ్‌పేయినగర్, లష్కర్‌బజార్ టీటీడీ కల్యాణ మండపం సమీపంలోని ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌లో ఇండోర్ సబ్‌స్టేషన్‌న్లు, విద్యుత్‌నగర్, వడ్డేపల్లి ఫిల్టర్‌బెడ్ వద్ద సబ్‌స్టేషన్లు, హనుమకొండ సర్కిల్ నూతన కార్యాలయం భవనం, విద్యుత్ ఉద్యోగుల ట్రైనింగ్ సెంటర్, టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ భవన్ ఐదో అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా పెద్దమ్మగడ్డలో నూతనంగా నిర్మించిన వరంగల్ సర్కిల్ కార్యాలయం, హనుమకొండలోని న్యూశాయంపేట డబుల్‌బెడ్‌రూం ఇళ్ల వద్ద నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు.
హసన్‌పర్తి: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య సూచించారు. హసన్‌పర్తిలోని ఉన్నత శ్రేణి ఆస్పత్రిని శనివారం ఆయన సందర్శించారు. స్క్రీనింగ్‌లో భాగంగా మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల నుంచి ఆస్పత్రికి వచ్చిన విద్యార్థినులతో మాట్లాడారు. సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎర్రగట్టుగుట్ట, మునిపల్లిలో వ్యాధి నిరోధక టీకా అవుట్ రీచ్ సెషన్‌ను అప్పయ్య పరిశీలించారు. ఎన్పీడీ స్క్రీనింగ్ 95 శాతం పూర్తిచేసిన సిబ్బందిని అభినందించారు. జిల్లా మాస్‌మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, వైద్యులు భార్గవ్, కృతిక, సురేశ్, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ శనివారం వేర్వేరుగా నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. వరంగల్ జిల్లా కోర్టులో నాలుగు బెంచీలు, నర్సంపేటలో ఒక బెంచీ ఏర్పాటు చేశారు. పెండింగ్‌లో ఉన్న 26 ఎన్‌ఐ యాక్ట్ కేసులు, అచల చిట్‌ఫండ్ పీఎల్‌సీ కేసులు 31, గ్రామీణ వికాస్ బ్యాంకు కేసులు 5 పరిష్కరించారు. అలాగే, హనుమకొండలో 8, పరకాల 2 బెంచీలు ఏర్పాటు చేశారు. పెండింగ్‌లో ఉన్న 31 ఎన్‌ఐ యాక్ట్ కేసులు పరిష్కరించారు. ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతానికి కృషిచేసిన ప్రధాన న్యాయమూరి మంత్రి రామకృష్ణ సునీత, హనుమకొండ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామలింగం, వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రదీప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్ స్పోర్ట్స్: జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 26న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్–13 చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి కన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ రెడ్డికాలనీలోని మాస్టర్‌జీ (వికాస్) హైస్కూల్‌లో బాలబాలికలకు వేర్వేరుగా ఈ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 1 జనవరి 2013న, ఆ తర్వాత జన్మించిన వారు పోటీలకు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 9059522986 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు


