పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ అర్బన్/హన్మకొండ కల్చరల్: పేరి ణి నాట్యం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, సంప్రదాయ కళలను పరిరక్షించి భావితరాలకు అందించడం ప్రతిఒక్కరి బాధ్యత అని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, నట రాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ, గజ్జెల రంజిత్‌కుమార్ హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన ‘పేరిణి నాట్య గురు–శిష్య పరంపర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా కళాకారుల ప్రదర్శన తిలకించిన అనంతరం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేరిణి నాట్యం కేవలం నృత్యరూపమే కాదని.. యుద్ధానికి వెళ్లే వీరుల్లో ధైర్యం, ఉత్సాహాన్ని నింపిన గొప్ప వారసత్వ కళారూపమని అన్నారు. కాళోజీ కళాక్షేత్రాన్ని రాష్ట్రంలో కళలకు శాశ్వత వేదికగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో నిలిచిపోయిన కళాక్షేత్ర నిర్మాణం పూర్తికావడంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. నటరాజ కళాకృష్ణ, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఉమామహేశ్వరి, ధరావత్ రాజ్‌కుమార్, విజయ రచన, పేరిణి నృత్య గురువులు, నాట్య కళాకారులు పాల్గొన్నారు.


