గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయకుంటే బిల్లుల్లో కోత విధిస్తామని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న హెచ్చరించారు. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండొద్దని స్పష్టం చేశారు. అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం పరిసరాలను సందర్శించారు. బస్‌స్టేషన్ వద్ద ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని స్టేడియం రహదారి విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. హనుమకొండ అశోక థియేటర్ ఎదుట ప్రతిపాదించిన మల్టీ లెవల్ పార్కింగ్ స్థలాన్ని పరిశీలించిన కమిషనర్.. టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టులో దర్గాకాజీపేట ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో దర్గా పీఠాధిపతి అఫ్జల్ బియాబానీ ఖుస్రూపాషాతో కలిసి దర్గా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈలు రవికుమార్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
నగరంలో వీధిదీపాల నిర్వహణ పటిష్టం చేయాలి
నగరంలో వీధిదీపాల నిర్వహణ పటిష్టం చేయాలని కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్‌తో కలిసి ఎలక్ట్రికల్ విభాగం పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రాంతాల్లో వీధిదీపాలు నిరంతరం వెలిగేలా పర్యవేక్షించాలని సూచించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మాధవీలత, రవికుమార్, అసిస్టెంట్ ఇంజనీర్లు అబ్దుల్ గఫూర్, సరిత, రాంకీ పాల్గొన్నారు.


