హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు గురువారం హనుమకొండ సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లకు మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆమె పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తయారు చేస్తున్న వంట ను పరిశీలించారు. అనంతరం హనుమకొండలోని వడ్డేపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. కళాశాలలోని తరగతి గదిలో ఎంపీసీ, బైపీసీ ఒకేషనల్ కోర్సుల తరగతుల విద్యార్థులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట ఇంటర్ విద్య డీఐఈఓ ఎ.గోపాల్, డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ మన్‌మోహన్, ఎంఈఓ నెహ్రూ, వడ్డేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ పటిష్టంగా చేపట్టాలి
హన్మకొండ అర్బన్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ వరంగల్ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్నతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రేడ్ లైసెన్సుల వసూళ్లు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాల వినియోగం అమలు, తడి, పొడి చెత్త సేకరణ అమలు, నగర సుందరీకరణ, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్వహణ, డెంగ్యూ, మలేరియా నివారణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఇందులో జీడబ్ల్యూఎంసీ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రాజారెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌న్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


