● జీఎంఆర్‌తో మాట్లాడి సమస్యను
పరిష్కరించిన కేసీఆర్, కేటీఆర్
● ప్రభుత్వ మాజీ చీఫ్ విప్
దాస్యం వినయ్‌భాస్కర్
హన్మకొండ: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే మామునూరు ఎయిర్‌పోర్టుకు అడుగులు పడ్డాయని, ఎయిర్‌పోర్ట్ కోసం అప్పటి సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మంజూరు చేయించారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం మాజీ మంత్రి కేటీఆర్ అనేకసార్లు ఢిల్లీ వెళ్లి అప్పటి విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా, హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారని తెలిపారు. ఉడాన్ పథకంపై కేంద్రంతో నిరంతరం చర్చలు జరిపారన్నారు. ఎయిర్ పోర్టు అథారిటి ఆఫ్ ఇండియా, జీఎంఆర్ సంస్థతో కేసీఆర్, కేటీఆర్ చర్చించి సమస్యను పరిష్కరించి మామునూరులో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు లైన్ క్లియర్ చేశారన్నారు. 1.8 కి.మీ రన్‌న్‌వేను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 3.8 కి.మీగా విస్తరించేందుకు రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్ట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థల సేకరణకు కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. నాయిని రాజేందర్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరన్నారు. సమావేశంలో నాయకులు మర్రి యాదవరెడ్డి, ఎల్లావుల లలితా యాదవ్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్‌ౠ మసూద్, నయిముద్దీన్, జోరిక రమేశ్, పోలెపల్లి రామ్మూర్తి, దూలం వెంకన్న పాల్గొన్నారు.


